ఏపీ vs తెలంగాణ‌.. ముదురుతున్న నీటి యుద్ధం!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నీటి యుద్ధం ముదురుతోంది. వేస‌వి కాలం ప్రారంభం అయిన నేప‌థ్యంలో సాగు, తాగు నీటి అవ‌స‌రాలు .. రెండు రాష్ట్రాల్లోనూ పెరిగాయి. దీంతో ముందుగా తెలంగాణ అప్ర‌మ‌త్తమైంది. చుక్క‌నీటిని కూడా.. వ‌దులుకోరాదంటూ.. అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఆదేశాలు జారీ చేశారు. మ‌రోవైపు సాగ‌ర్ వ‌ద్ద అప్ర‌మ‌త్తంగా కూడా ఉంటున్నారు. ఒక‌ప్పుడు ఉద‌యం వేళ‌ల్లో మాత్ర‌మే ఇంజ‌నీర్లు.. సాగ‌ర్ ద‌గ్గ‌ర ఉండేవారు.

కానీ, ఇప్పుడు 24 గంట‌లు కూడా అధికారులు సాగ‌ర్ వ‌ద్దే ఉంటున్నారు. దీనిని బ‌ట్టి తెలంగాణ నీటి వ‌నరుల విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అర్ధ‌మ‌వుతుంది. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. సొంత‌గా మరిన్ని ప్రాజెక్టులు క‌ట్టుకోవ‌డం ద్వారా జ‌ల స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే క‌ర్నూలు జిల్లాలోని బ‌న‌క‌చ‌ర్ల వ‌ద్ద భారీ ప్రాజెక్టుకు ఏపీ స‌ర్కారు శ్రీకారం చుడుతోంది. అవ‌స‌ర‌మైతే.. దీనిని తామే చేప‌ట్టేందుకు కూడా రెడీగా ఉన్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు రెండు రోజుల కిందట ప్ర‌క‌టించారు.

అయితే.. దీనిని తాజాగా మ‌రోసారి తెలంగాణ ప్ర‌భుత్వం వ్య‌తిరేకించింది. జ‌గ‌న్ హ‌యాంలో చేప‌ట్టిన రాయల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని, ఇప్పుడు చంద్ర‌బాబు సంక‌ల్పిస్తున్న బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును కూడా.. తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న తెలంగాణ‌.. ఆయా ప్రాజెక్టుల‌పై సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని తాజాగా నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స్టాండింగ్ కౌన్సిల్, అడ్వొకేట్ జ‌న‌ర‌ల్‌తో చ‌ర్చించారు.

జ‌లాల విష‌యంలో ఏపీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తోంద‌ని.. కేంద్ర సంస్థలు, బోర్డుల అనుమతి లేకుండా.. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తోంద‌ని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. తాము తెలంగాణ హ‌క్కుల‌ కోసం ఎంత‌కైనా వెళ్తామ‌ని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. ఏపీ ప్ర‌భుత్వం ప్రాజెక్టుల క‌డుతున్నా.. రేవంత్‌రెడ్డి సోయి లేకుండా ఉన్నార‌ని.. బీఆర్ఎస్ నాయ‌కులు దుయ్య‌బ‌డుతున్న నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఏపీ పై న్యాయ పోరాటానికి దిగుతుండ‌డం గ‌మ‌నార్హం.