బాబుకు నచ్చక పోతే ఇలానే వుంటదా

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్ట‌యిలే వేరు. పార్టీ నాయ‌కుల విష‌యంలో ఆయ‌న అన్ని కోణాల్లోనూ ప‌రిశీ ల‌న చేస్తారు. విన‌య విధేయ‌తతో ఉన్న‌వారికి ఆయ‌న వీర‌తాళ్లు వేయ‌డం తెలిసిందే. పార్టీని అన్ని విధాల పైకి తీసుకువ‌స్తార‌ని భావిస్తే.. మ‌ట్టిలో ఉన్నా.. మాణిక్యాలుగా మారుస్తారు. అలాంటి చంద్ర‌బాబే.. తేడా వ‌స్తే.. అంతే వేగంగా నాయ‌కుల‌ను ప‌క్క‌న పెడ‌తారు. తాజాగా నందిగామ పర్యటనలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుని ప‌క్క‌న పెట్టారు చంద్ర‌బాబు.

ఎన్టీఆర్ జిల్లాలో శ‌నివారం ప‌ర్య‌టించిన సీఎం చంద్ర‌బాబు.. హెలికాప్టర్ దిగి నేతలను పరిచయం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు వ‌రుస‌గా ఆయ‌న‌కు పుష్పాలు అందించి.. స్వాగ‌తం ప‌లికారు. ఈ క్ర‌మంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికేపూడి శ్రీనివాస‌రావు కూడా.. అదే లైన్‌లో నిల‌బ‌డ్డారు. కానీ, అప్ప‌టికే కొలిక‌పూడి వ్య‌వ‌హ‌రించిన తీరు.. పార్టీని, ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేస్తున్నార‌న్న ఫిర్యాదుల నేప‌థ్యంలో చంద్ర‌బాబు సీరియ‌స్‌గా ఉన్నారు.

ఈ క్ర‌మంలో అందరు నేతలతో కరచాలనం చేసిన చంద్రబాబు.. కొలికిపూడి విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం సైలెంట్ అయిపోయారు. అంతేకాదు.. ఆయ‌న‌ను చూసి కూడా చూడ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న క‌ర‌చాల‌నం చేయ‌బోగా.. కొలిక‌పూడి వెనుక ఉన్న వ్య‌క్తిని ముందుకు పిలిచి.. చంద్ర‌బాబు ఆయ‌న నుంచి పుష్పాన్ని తీసుకున్నారు. దీంతోపాటు కొలిక‌పూడిపై సీరియ‌స్‌గా చూశారు. దీంతో విష‌యం అర్థ‌మైన కొలిక‌పూడి చేసేది లేక .. వెనక్కి వెళ్లి నిలబడ్డారు. ఇక‌, నాయ‌కుడే కొలిక‌పూడిని వెన‌క్కి పెడితే.. ఇత‌ర నేత‌లు మాత్రం ఊరుకుంటారా? వారు మ‌రింత‌గా శ్రీనివాస‌రావును వెన‌క్కి నెట్టారు.

తాజా పరిణామాలతో కొలిక‌పూడికి చంద్ర‌బాబు భారీ షాకే ఇచ్చార‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు ఆయ‌న ఇప్ప‌టికైనా త‌న‌ను తాను తెలుసుకుని.. విన‌యంతో ఉంటేనే భ‌విత‌వ్యం ఉంటుంద‌ని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలావుంటే.. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ కోల్పోయిన మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా.. తాజాగా చంద్ర‌బాబును క‌లుసుకుని స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న ఎక్క‌డా అల‌గ‌లేదు. కానీ, మ‌న‌సులో అయితే.. ఒకింత ఆవేద‌న ఉంది.