పొట్లంలో భోజనం.. ఆరేడు కిలోమీటర్ల నడకతో బాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన బాల్యం, విద్యాభ్యాసం గురించి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదికలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల గ్రామంలో పర్యటించిన సందర్భంగా గ్రామంలో బంగారు కుటుంబంగా ఎంపికైన ఓ కుటుంబం వద్దకు వెళ్లిన ఆయన ఆ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా గడిపారు. వారి ఇంటిలో టీ పెట్టుకుని మరీ వారితో కలిసి సేవించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగానే తన బాల్యం ఎలా గడిడించిందన్న విషయాన్ని వివరించారు. తన విద్యాభ్యాసం కోసం తాను ఎంత కష్టపడ్డానన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.

తిరుపతి సమీపంలోని నారావారిపల్లెలో చంద్రబాబు జన్మించిన సంగతి తెలిసిందే. నారావారిపల్లెకు సమీపంలోని చంద్రగిరిలో పాఠశాల విద్యను పూర్తి చేసిన చంద్రబాబు… ఆ తర్వాత తిరుపతిలో కళాశాల విద్యను పూర్తి చేశారు. ముప్పాళ్ల గ్రామ పరిస్థితులను వివరించిన సందర్భంగా తాను కూడా ఓ గ్రామంలో పుట్టిన వాడినేనని, ఈనాడు ఉన్న పరిస్థితులు నాడు గ్రామాల్లో ఉండేవి కావని ఆయన తెలిపారు. నాడు తాను విద్యాభ్యాసం కోసం నిత్యం ఆరేడు కిలో మీటర్లు నడిచి మరీ పాఠశాలకు వెళ్లేవాడినని ఆయన తెలిపారు. ఈ క్రమంలో మధ్యాహ్న భోజనాన్ని క్యారియర్ లో కాకుండా ఆహారాన్ని ఓ పొట్లంతో చుట్టుకుని వెళ్లేవాడినని తెలిపారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆ పొట్లంను పడేసేవాళ్లమని తెలిపారు.

నాడు తమకు ఎదురైన దుర్భర పరిస్థితులు ఇప్పటి గ్రామాల ప్రజలకు గానీ, విద్యార్థులకు గానీ లేవని చంద్రబాబు తెలిపారు. అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు చక్కగా చదువుకుని ఉజ్వల భవిష్యత్తును అందుకోవాలని ఆయన సూచించారు. దుర్భర పరిస్థితుల్లో విద్యనభ్యసించిన కారణంగానే పరిస్థితులను ఎలా మెరుగు చేస్తే… ఇప్పటి పిల్లలకు బాగుంటుందన్న విషయంపై నాడు తనకు ఓ అవగాహన వచ్చిందని… దానికి అనుగుణంగానే పనిచేసుకుంటూ వెళ్లానని తెలిపారు. ఫలితంగా తెలుగు పిల్లలు ఉజ్వల భవిష్యత్తును అందుకుని ప్రపంచాన్ని ఏలుతున్నారని, ఈ విషయాన్ని తలచుకున్నప్పుడల్లా తనకు గర్వంగా ఉంటుందని తెలిపారు. ఏ దేశానికి వెళ్లినా… అక్కడ మన తెలుగు వారు, భారతీయులు ఉంటున్నారని… ఆయా దేశాల్లోని వారి కంటే మనోళ్ల తలసరి ఆదాయాలే అధికంగా ఉంటున్నాయని కూడా చంద్రబాబు పేర్కొన్నారు.

ముప్పాళ్ల గ్రామంలో వెయ్యికి పైగా కుటుంబాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ కుటుంబాల్లో పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు 41 ఉన్నాయన్న చంద్రబాబు.. ఆ కుటుంబాలను ఇతర కుటుంబాల తరహాలోనే అభివృద్ధి చేసేందుకు ఐదుగురు మార్గదర్శులు ముందుకు వచ్చారన్నారు. బంగారు కుటుంబాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు మార్గదర్శులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. మార్గదర్శుల సహకారంలో బంగారు కుటుంబాలు పురోగతి బాట పట్టాలని ఆయన సూచించారు. ఫలితంగా గ్రామంలో పేదరికం అన్నదే లేకుండా పోతుందని అభిప్రాయపడ్డారు. ఇక సంతానం విషయంలోనూ ముప్పాళ్ల వాసులు జాగ్రత్త వహించాలని, పిల్లలు వద్దనుకునే ఇప్పటి నయా ట్రెండ్ ను పక్కనపెట్టాలని ఆయన సూచించారు. పిల్లలను కంటేనే ముప్పాళ్ల ఏళ్ల తరబడి ఉనికిలో ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు.