కాకాణికి టెన్ష‌న్‌.. హైకోర్టు కీల‌క నిర్ణ‌యం!

వైసీపీ మాజీ మంత్రి, కీల‌క నాయ‌కుడు కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌పై హైకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సోమ‌వారం వ‌ర‌కు ఈ పిటిష‌న్‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం లేద‌ని..అప్ప‌టి వ‌ర‌కు ఎదురు చూడాల్సిందేన‌ని తాజాగా తేల్చి చెప్పింది. దీంతో కాకాణికి మ‌రింత టెన్ష‌న్ పెరిగింది. నెల్లూరు జిల్లా పొద‌ల‌కూరులోని రుస్తుం మైనింగ్ లో రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ ఖ‌నిజాన్ని అక్ర‌మంగా త‌ర‌లించి సొమ్ము చేసుకున్నార‌న్న‌ది ప్ర‌ధాన అభియోగం. అయితే.. ఈ కేసులో మ‌రోకేసు కూడా వ‌చ్చి చేరింది. ఖ‌నిజాన్ని త‌ర‌లించే క్ర‌మంలో అడ్డుకున్న గిరిజ‌నుల‌పై దాడి చేయించార‌న్న‌ది మ‌రో అభియోగం.

దీంతో గ‌నుల అక్ర‌మాలు స‌హా.. ఎస్టీల‌పై దాడి చేశార‌ని.. పేర్కొంటూ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టం కింద పొద‌ల‌కూరు పోలీసులు కాకాణిపై కేసు న‌మోదు చేశారు. ఫిబ్ర‌వ‌రి 16న న‌మోదైన ఈ కేసులో ఆయ‌న‌ను తొలుత అరెస్టు కంటే కూడా విచార‌ణ జ‌ర‌పాల‌ని బావించారు. అయితే.. గిరిజ‌నుల ఫిర్యాదుతో అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పోలీసు వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు.. అస‌లు నోటీసులు తీసుకునేందుకు కూడా కాకాణి అంగీక‌రించ‌డం లేద‌ని పోలీసులు చెబుతున్నారు. నెల్లూరులో ఉన్నార‌ని భావించి రెండు రోజుల కింద‌ట అక్క‌డకు వెళ్లి నోటీసులు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

కానీ.. పోలీసులు వ‌స్తున్నార‌ని తెలిసి.. కాకాణి జంప్ అయ్యారు. త‌ర్వాత హైద‌రాబాద్‌లో ఓ ఫంక్ష‌న్‌కు హాజ‌ర‌య్యార‌ని తెలిసిన పోలీసులు అక్క‌డ‌కు వెళ్ల‌గా అక్క‌డ కూడా త‌ప్పించుకున్నారు. ఇంత‌లోనే హైకోర్టులో ముంద‌స్తు బెయిల్ కోసం దాఖ‌లు చేసుకున్నారు. అయితే.. ఎస్సీ, ఎస్టీ చ‌ట్టం కింద కేసు న‌మోదైన నేప‌థ్యంలో దీనిని లోతుగా విచారించాల్సి ఉంటుంద‌ని గురువారం పేర్కొన్న కోర్టు శుక్ర‌వారం సుదీర్ఘ విచార‌ణ చేసింది. ఈ సంద‌ర్భంగా కాకాణి త‌ర‌పున న్యాయ‌వాదులు త‌మ వాద‌న‌లు వినిపించారు. ఎస్టీల‌పై ఎలాంటి దాడులు జ‌ర‌గ‌లేద‌ని.. ఇది రాజ‌కీయ ప్రేరేపిత కేసుగానే చూడాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

అట్రాసిటీ కేసు న‌మోదైన‌ప్ప‌టికీ. ప‌రిస్థితికి త‌గిన విధంగా బెయిల్‌ను మంజూరు చేయొచ్చ‌ని గ‌తంలో సుప్రీంకోర్టు చెప్పిన విష‌యాల‌ను ఈ సంద‌ర్భంగా కోర్టుకు వివ‌రించారు. అయితే.. హైకోర్టు మాత్రం.. ఇది లోతైన కేసుగానే చూస్తున్నామ‌ని.. ప్రాసిక్యూష‌న్ త‌ర‌ఫున సోమ‌వారం వాద‌న‌లు వినిపిస్తామ‌ని చెబుతున్నందున‌.. అప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేయాల‌ని సూచించింది. అయితే.. ఈలోగా ఎలాంటి దూకుడు చ‌ర్య‌లు తీసుకోకుండా.. పోలీసులను నిలువ‌రించాల‌ని కాకాణి త‌ర‌ఫున న్యాయ‌వాది కోర్టును అభ్య‌ర్థించారు. దీనికి అలాంటి ఆదేశాలు ఇవ్వ‌లేమ‌ని.. విచార‌ణ‌కు ఎవ‌రైనా స‌హ‌క‌రించాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. దీంతో సోమ‌వారం వ‌ర‌కు కాకాణికి టెన్ష‌న్ త‌ప్పేలా లేదు. మ‌రోవైపు.. ఆయ‌న కోసం పోలీసులు హైద‌రాబాద్‌, నెల్లూరు, చెన్నై స‌హా బెంగ‌ళూరులోనూ జ‌ల్లెడ ప‌డుతున్నారు.