ప్రభుత్వ వైద్య సేవల గురించి పెదవి విరవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి మరి. అయితే ఎల్లకాలం అవే పరిస్థితులు ఉండవు కదా. ఇతరత్రా రంగాలకు మాదిరిగానే సర్కారీ వైద్య రంగంలోనూ ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులను మరింతగా ముందుకు తీసుకెళ్లే దిశగా ఏపీలోని కూటమి సర్కారు నడుం బిగించింది. ఈ మేరకు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పలు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయి?.. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వంద పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేయాలంటే… ఇంకెన్ని ఆసుపత్రులను ఏర్పాటు చేయాల్సి రావచ్చు అన్నదానిపై ఓ నివేదికను తయారు చేయాలని ఆయన అదికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఆసుపత్రుల నిర్మాణం కోసం ఎంత మేర నిధులు అవసరం అవుతాయన్న దానిపైనా నివేదికలో పొందుపరచాలని ఆయన సూచించారు.
గ్రామ స్థాయిలో కొనసాగుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్ సీ), రెవెన్యూ డివిజనల్ కేంద్రాల్లో కొనసాగుతున్న కమ్యూనిటి హెల్త్ సెంటర్ (సీహెచ్ సీ)లల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పీహెచ్ సీ, సీహెచ్ సీల్లో అవసరమైతే… వర్చువల్ వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఈ తరహా సేవల ద్వారా ప్రజలకు త్వరితగతిన మెరుగైన సేవలు లభించే అవకాశం ఉంటుందని, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన అవసరం రాదని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్దారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates