కన్నతల్లిని మోసం చేసిన రాజకీయ నాయకుడిగా జగన్ కొత్త చరిత్ర సృష్టించారని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్, జగన్ సోదరి వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఇలాంటి కొడుకును కన్నందుకు.. ఆతల్లి రోజూ కుమిలి పోతోందని వ్యాఖ్యానించారు. సరస్వతి భూములు, షేర్లకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందంపై జగనే స్వయంగా సంతకం చేశారని.. కానీ.. ఇప్పుడు తాను ఇంకా సంతకం చేయలేదని.. ప్రాసెస్ నిలిపివేశామని చెప్పి.. మోసానికి దిగారని ఆమె ఆరోపించారు.
తాజాగా ఈ విషయంపై స్పందించిన షర్మిల.. జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. గురువారం.. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో జగన్ అఫిడవిట్ వేసిన విషయం తెలిసిందే. తన తల్లి, చెల్లి.. తనను మోసం చేశారని.. ప్రత్యర్థులతో చేతులు కలిపారని.. ఈ నేపథ్యంలో ఇవ్వాలని అనుకున్న షేర్లను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. దీనిపై ఇంకా ప్రొసీజర్ కూడా పూర్తికాకుండానే సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
ఈ వ్యవహారంపైనే షర్మిల స్పందిస్తూ.. విజయమ్మకు సరస్వతి షేర్లను జగన్ గిఫ్ట్‌గా ఇచ్చారని.. ఇది ముమ్మాటికీ వాస్తవమని పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు అబద్ధాలు ఆడుతూ.. కన్నతల్లినే మోసం చేస్తున్నారని చెప్పారు. ఒకసారి అమ్మకు రాసిచ్చిన షేర్లను వెనక్కి తీసుకుంటానని చెప్పడం జగన్‌కే చెల్లిందని ఆమె దుయ్యబట్టారు. తల్లిపై కేసు వేసి.. ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న కొడుకుగా.. జగన్ చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు.
ఇక, తన వ్యవహారంపై స్పందించిన షర్మిల.. తన తండ్రి మరణం తర్వాత.. తనకు చిల్లిగవ్వకూడా.. ఆస్తుల్లో భాగం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. తాను అడుగుతానని భయంతోనే పార్టీ నుంచి బయటకు పంపేశారని సంచలన ఆరోపణలు చేశారు. తానేమీ జగన్ సంపాయించుకున్న దానిలో వాటా అడగడం లేదని.. ఉమ్మడిగా ఉన్న వ్యాపారాల్లోనే భాగం కోరుతున్నానని.. తాను వెనక్కి తగ్గేదేలేదని చెప్పుకొచ్చారు.