రేవంత్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు మ‌ళ్లీ బ్రేకులు?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అంశం.. మ‌రోసారి వాయిదా ప‌డిన‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ నెల 3(గురువారం) మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. అంతే కాదు.. గ‌త నెల చివ‌రి వారంలో సీఎం రేవంత్ రెడ్డి.. హుటాహుటిన గ‌వ‌ర్న‌ర్‌ను కూడా క‌లిశారు. అప్ప‌ట్లోనే మంత్రి విస్త‌ర‌ణ‌కు సంబంధించిన జాబితాను రేవంత్ గ‌వ‌ర్న‌ర్ కు ఇచ్చార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది.

అయితే.. గురువారం కూడా.. ఎలాంటి చ‌డీ చ‌ప్పుడు లేక‌పోవ‌డం.. సీఎం స‌హా అంద‌రూ.. వ‌క్ఫ్ బోర్డు బిల్లు విష‌యంపై మంత‌నాలు జ‌ర‌ప‌డం వంటి విష‌యాల్లో మునిగిపోయారు. మ‌రోవైపు సుప్రీంకోర్టు కూడా.. రేవంత్‌ను హెచ్చ‌రించిన నేప‌థ్యంలో ఇప్పుడు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అంశంపై మాట్లాడేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు మ‌ళ్లీ బ్రేకులు ప‌డిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఇది అధిష్టానం స్థాయిలో జ‌ర‌గ‌లేద‌ని.. స్థానికంగానే బ్రేకులు ప‌డిన‌ట్టు భావిస్తున్నామ‌ని కొంద‌రు నాయ‌కులు చెబుతున్నారు.

ఏం జ‌రిగింది?

ఏదో ఒక కారణంతో గడచిన 10 నెలలుగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అంశం వాయిదా పడుతూ వస్తోంది. ప్ర‌స్తుతం జ‌రిగిన వాయిదాకు.. మంత్రుల లిస్టు విషయంలో పార్టీ అగ్రనేత రాహుల్ ఒప్పుకోలేదన్న ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబితాలో కొందరి పేర్ల పై ఆయ‌న‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా సీనియ‌ర్ల‌ను కాద‌ని.. జూనియ‌ర్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌డాన్ని కూడా.. పార్టీ త‌ప్పుబ‌డుతున్న‌ట్టు తెలిసింది.

వాస్త‌వానికి చాలానే ఖాళీలు ఉన్న‌ప్ప‌టికీ.. క‌నీసంలో క‌నీసం.. నలుగురికి తొలుత అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికిగాను సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా వీరి ఎంపిక చేశారు. కానీ.. సీనియ‌ర్ల‌యినా.. కొంద‌రు మాజీ మంత్రులు, అధిష్టానం ద‌గ్గ‌ర మంచి ప‌లుకుబ‌డి ఉన్న నాయ‌కులకు మొండి చేయి చూపించార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ నేప‌థ్యంలో వారే.. ఇప్పుడు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు అడ్డు ప‌డుతున్నార‌ని.. అందుకే జాప్యం జ‌రుగుతోంద‌ని అంటున్నారు.