కేటీఆర్ వ్యాఖ్యలు ‘రియల్’పై పిడుగుపాటేనా..?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న ఈ భూములను తాము అధికారంలోకి వస్తే… తిరిగి వర్సిటీకి అప్పగిస్తామని చెప్పిన కేటీఆర్… ఆ భూములను ఎవరూ కొనుగోలు చేయవద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ వ్యక్తులు ఈ భూములను కొనుగోలు చేసినా.. వాటిని వెనక్కు తీసుకుంటామని, ఫలితంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని ఆ భూములను కొనుగోలు చేసే వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. వెరసి ఈ వ్యాఖ్యలపై ఇప్సుడు పెద్ద చర్చే నడుస్తోంది. కేటీఆర్ వ్యాఖ్యలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు పిగుడుపాటేనని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా… హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించే దిశగా చర్యలు చేపడుతూ వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం పురోభివృద్ధికి దోహదపడేలానే ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. నిరుపయోగంగా ఉన్న భూములను ప్రభుత్వ భవనాల కోసమో, లేాదంటే ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు విక్రయించడం ద్వారా సర్కారుకు ఆదాయాన్ని సమకూర్చడమో చేస్తూ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ధి చెందేలా వ్యవహరిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం నగరంలో ఇలా నిరుపయోగంగా ఉన్న భూములను వేలం వేసి ప్రభుత్వానికి భారీ ఆదాయాన్నే సమకూర్చిపెట్టారు. ఆ భూములను ఉపయోగంలోకి తీసుకుని వచ్చి రియల్ రంగానికి కొత్త ఊపిరి ఊదారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే… రియల్ ఎస్టేట్ రంగం పడకేసిందని, నగరం నుంచి ప్రభుత్వానికి ఆదాయం పడిపోయిందని కూడా బీఆర్ఎస్ ఆరోపించింది.

అయితే ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఓ రకమైన భయాందోళనలు రేకెత్తే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు వేలం వేసే భూములను నిబంధనల మేరకే దక్కించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు సాగుతున్నారు. నగరాన్ని నలుదిశలా విస్తరించేలా చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సెంట్రల్ వర్సిటీ భూములను కొనుగోలు చేస్తే… తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని వెనక్కు తీసుకుంటామని కేటీఆర్ చెప్పడం ద్వారా ఆ భూముల వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నెత్తి చూడటానికి కూడా జడిసే ప్రమాదం లేకపోలేదు. అంతేకాకుండా కాంగ్రెస్ సర్కారు ఇతరత్రా భూములను వేలం వేసినా… భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. ఎక్కడ లాగేసుకుంటుందోనన్న భయాందోళనలు కూడా రియల్ వ్యాపారుల్లో రేకెత్తే ప్రమాదం లేకపోలేదు. వెరసి కేటీఆర్ వ్యాఖ్యలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగ పురోభివృద్ధికి ఆడ్డంకిగా మారే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.