అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరింత చిక్కుల్లో పడిపోయారు. ఈ కేసులో ఇప్పటికే 2 రోజుల పాటు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన కాకాణికి.. మంగళవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో తనపై తొందరపాటు చర్యలు చేపట్టకుండా… ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న కాకాణి పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఇందులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను ఆదేశించజాలమంటూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వెరసి పరిస్థితి చూస్తుంటే..కాకాణి ఏ క్షణమైనా అరెస్టు అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదన వినిపిస్తోంది.
వైసీపీ అధికారంలో ఉండగా… వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన అనుచరులతో కలిసి ఆయన నెల్లూరు జిల్లాలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఆధారం చేసుకుని ఇదివరకే పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేయగా… ఈ కేసులో కాకాణి ప్రమేయాన్ని నిర్ధారించుకుని తాజాగా ఆయన పేరును కూడా ఏ4గా చేర్చారు. ఈ క్రమంలో సోమవారం నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆదివారం నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు యత్నించారు. అయితే కాకాణి ఆచూకీ లభించలేదు. సోమవారం కూడా నోటీసుల జారీకి హైదరాబాద్ వెళ్లి మరీ పోలీసులు యత్నించినా ఫలితం కనిపించలేదు.
తాజాగా మంగళవారం తాపీగా పోలీసులకు కాకాణి ఓ సమాచారాన్ని పంపించారట. తాను ప్రస్తుతం అందుబాటులో లేనని… బుధవారం నెల్లూరులో తమ బంధువుల ఇంట ఓ కార్యక్రమం ఉందని, దానికి తాను హాజరు కావాల్సి ఉందని, ఆ తర్వాత గురువారం నుంచి తాను అందుబాటులో ఉంటానని తెలిపారట. అంటే… విచారణకు గురువారం అయితే వస్తానని ఆయన ఇండైరెక్టుగా చెప్పినట్టైంది. అదే సమయంలో కాకాణి బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రాగా… పోలీసులు కాకాణి చర్యలను కోర్టు ముందు ఉంచారట. రెండు రోజులుగా నోటీసులు తీసుకోకుండా కాకాణి తమను ముప్పు తిప్పలు పెడుతున్నారని వారు కోర్టుకు తెలిపారట. అంతేకాకుండా తమ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ… తాము అక్కడికి వెళ్లేలోగానే అక్కడి నుంచి తప్పించుకుంటూ సాగారని తెలిపారట.
అంతేకాకుండా కాకాణిపై అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసుతో పాటు ఓ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు అయిందని కూడా పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారట. ఈ క్రమంలో కాకాణికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వాల్సిన పని లేదని, చట్టాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న కాకాణి లాంటి నేతలకు మినహాయింపులు ఇస్తే…అలా వ్వవహరించే వారి సంఖ్య మరింతగా పెరుగుతుందని, అలాంటి వ్యవహార సరళిని ప్రోత్సహించినట్టు అవుతుందని కోర్టుకు తెలిపాటర. ఈ మొత్తం వాదనలు విన్నకోర్టు… కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. అదే సమయంలో మంగళవారం నాటి విచారణకు రాకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు కాకాణి అనుచరులకు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక హైకోర్టు కూడా కాకాణి వాదనను తిరస్కరించడంతో ఆయనను పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.