రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేకెత్తించి.. అనేక అనుమానాలను కూడా సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి వ్యవహారంలో దాదాపు క్లారిటీ వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రహదారిపై గత సోమవారం.. అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ పై వస్తున్న ఆయన.. కాకినాడ సమీపంలోని ఓ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న రహదారి పక్కన పడిపోయి ప్రాణాలు కోల్పోయారు.
అయితే.. ఆయన మృతిపై అనేక అనుమానాలు తలెత్తాయి. ముఖం, చేతులపై గాయాలు ఉండడం.. పాస్టర్‌గా ఆయన ఓ పార్టీ పాలనపై విమర్శలు గుప్పించడం వంటివి మరణంపై అనుమానాలు వచ్చేలా చేశాయి. దీనిపై పాస్టర్ల సంఘాలు కూడా.. ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఏపీ సర్కారు విచారణకు ఆదేశించింది. డీఎస్పీ ఆధ్వర్యంలో ఐదుగురు ఉన్నతాధికారులతో కూడిన బృందం.. హైదరాబాద్ నుంచి కాకినాడ వరకు ఆయన ప్రయాణించిన రహదారుల వెంబడి ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను చాలా ఓర్పుగా పరిశీలించింది.
ఈ క్రమంలో హైదరాబాద్ దాటిన దగ్గర నుంచి ఆయన వ్యవహరించిన తీరు.. ఎక్కడెక్కడ ఆగిందీ.. ఎవరిని కలుసుకున్నదీ.. ఏం చేసింది కూడా.. విచారణ బృందం తెలుసుకుంది. తాజాగా అందిన అనధికార సమాచారం మేరకు.. గత సోమవారం హైదరాబాద్లో బయలు దేరిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ .. కోదాడ దగ్గర నుంచి కాకినాడ వరకు మధ్యలో రెండు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీటికి ఆయన కోదాడలో 850 రూపాయలు, కాకినాడ ఎంట్రన్స్‌లో 350 రూపాయలను ఫోన్ పే ద్వారా చెల్లించినట్టు గుర్తించారు.
ఇక, విజయవాడ సమీపానికి వచ్చే ముందే.. ఆయన ప్రమాదానికి గురయ్యారని.. దీంతో బుల్లెట్ హెడ్‌లైట్ పగిలిపోవడంతోపాటు.. పాస్టర్ ధరించిన హెల్మెట్‌కు సొట్టలు కూడా పడ్డాయని.. చేతులకు కూడా గీసుకు పోయిన గాయాలు అయ్యాయని గుర్తించారు. విజయవాడ బెంజిసర్కిల్ దాటే సరికి.. ఆయన పూర్తిగా స్పృహ కోల్పోయి.. రోడ్డుపై పడిపోయారని, పోలీసు అధికారి స్పందించి.. ఆయన పక్కనే ఉన్న పచ్చిక బయళ్లలో పడుకోబెట్టారని సాక్ష్యాధారంగా నమోదు చేశారు.
అక్కడ నుంచి కొంత తేరుకుని.. కాకినాడ దిశగా వెళ్లారు. అక్కడ కూడా.. మద్యం బాటిల్ కొనుగోలు చేయడం.. అనంతరం.. కొద్ది దూరంలో మరణించడం గమనార్హం. అయితే. ఈ వ్యవహారంపై అనుమానాలు దాదాపు తొలిగిపోయినా.. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అదేవిధంగా పోస్టు మార్టం రిపోర్టు కూడా రావాల్సి ఉంది.