బంగారు కుటుంబాల‌ను ఎంపిక చేసిన చంద్ర‌బాబు.. వారికి పండ‌గే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పీ-4 విధానాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు. ఇరువురుక‌లిసి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ప‌బ్లిక్‌-ప్రైవేటు-ప‌బ్లిక్ – పార్ట‌న‌ర్‌షిప్‌గా పేర్కొనే పీ-4 ద్వారా పేద‌రికాన్ని నిర్మూలించాల‌న్న ల‌క్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ విధానంలో స‌మాజంలోని ఉన్న‌త వ‌ర్గాలు.. పేద‌ల‌ను ద‌త్త‌త తీసుకుని.. వారిని అన్ని విధాలా పైకి తీసుకురావాల‌ని ఆయ‌న సూచించారు. ఈ కార్యక్ర‌మంలో రెండు ల‌బ్ది పొందే కుటుంబాల‌ను చంద్ర‌బాబు ఎంపిక చేశారు.

వీరిలో మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబం, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయెల్‌ కుటుంబాన్ని పీ-4 విధానానికి తొలిగా ఎంపిక చేశారు. వీరిని బంగారు కుటుంబాలుగా పేర్కొన్న చంద్ర‌బాబు.. వీరిని ద‌త్త‌త తీసుకునేందుకు త్వ‌ర‌లోనే మార్గ‌ద‌ర్శ‌కుల‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్టు చెప్పారు. పేద‌ల‌కు సాయం చేసే ఉన్న‌త కుటుంబాల‌ను మార్గ‌ద‌ర్శ‌కులుగా పేర్కొన్నారు. వీరు నిస్వార్థంగా పేద‌ల కుటుంబాల‌ను ఆదుకుంటార‌ని.. అన్ని విధాలా వారిని పైకి తీసుకువ‌స్తార‌ని చెప్పారు.

ఇక‌, ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు త‌న విజ‌న్‌ను ఆవిష్క‌రించారు. సుమారు గంటా 20 నిమిషాల సేపు మాట్లాడిన చంద్ర‌బాబు పేద‌రికం బాధేంటో త‌న‌కు తెలుసున‌ని చెప్పారు. 1995 నుంచి కూడా పేద‌రికాన్ని నిర్మూలించాల‌న్న సంక‌ల్పంతో తాను అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. ఇప్పుడు చేప‌ట్టిన పీ-4 కార్య‌క్ర‌మం.. మ‌హోన్న‌త‌మైంద‌న్నారు. ఇది స‌క్సెస్ చేయాల ని.. అధికారులు, ప్ర‌భుత్వ సిబ్బందికి చెప్పిన‌ట్టు తెలిపారు. దీనిని స‌క్సెస్ చేయ‌డం ద్వారా వ‌చ్చే నాలుగేళ్ల‌లో రాష్ట్రంలో పేదరికాన్ని లేకుండా చేస్తామ‌ని చెప్పారు. తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించామ‌న్నారు.

అదే నా కోరిక‌!

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పుకొచ్చారు. పేద‌లు లేని స‌మాజ స్థాప‌నే త‌న కోరిక అని తెలిపారు. తాను అనేక ప‌ద‌వులు అనుభవించాన‌ని.. అధికారంపై వ్యామోహం లేద‌న్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల‌న్న త‌ప‌న‌తోనే కూట‌మి క‌ట్టి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువ చ్చామ‌ని.. ప్ర‌జ‌లు కూడా అర్ధం చేసుకుని భారీ విజ‌యం అందించార‌ని తెలిపారు. ఇప్పుడు స‌మాజాన్ని బాగు చేయ‌డ‌మే త‌న కోరిక‌ని తెలిపారు. “నేను ఏ తప్పూ చేయలేదు.. భవిష్యత్‌లో చేయను. పని చేయడం తప్ప నాకు మరేమీ తెలియదు. 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా జీవించా.” అని చంద్ర‌బాబు ఉద్ఘాటించారు.