వర్మపై వైసీపీ ఇంతగా ఆశ పెట్టుకుందా..?

శ్రీ వస్తవాయి సత్యనారాయణ వర్మ… మనమంతా షార్ట్ గా పిలుచుకునే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ చుట్టూ ఇప్పుడు వైసీపీలో పెద్ద చర్చే నడుస్తోంది. వర్మ వైసీపీలో చేరిపోవడం ఖాయమని, 2029 ఎన్నికల్లో వర్మ పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, మొన్నటి ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పై పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎపీ వంగా గీత రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేస్తారని చర్చ జరుగుతోంది. వంగా గీత ప్రస్తావనపై అంతగా చర్చ జరగకున్నా.. వర్మ గురించి మాత్రం వైసీపీలో ఓ రేంజిలో చర్చ జరుగుతోంది. వైసీపీ సోషల్ మీడియా నిండా దీనిపైనే చర్చ సాగుతోంది.

పిఠాపురంలో వర్మకు మంచి పట్టు ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే… గతంలో ఓ సారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరీ విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన వర్మ… టీడీపీకి, పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం పోటీ నుంచి తప్పుకోమని చంద్రబాబు చెప్పినంతనే… వర్మ పోటీ నుంచి తప్పుకోవడంతో పాటుగా పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేసి పవన్ కల్యాణ్ గెలుపులో కీలక భూమిక పోషించారు. అటు పవన్ ఫాలోయింగ్, ఇటు వర్మ కేడర్, ప్రచారంతో పవన్ కు రికార్డు మెజారిటీ వచ్చింది.

అదంతా గతం అయితే…పవన్ కోసం తన సీటును త్యాగం చేస్తే,..ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని వర్మకు చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూటమి అదికారం చేపట్టిన తర్వాత రెండు దఫాలుగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా… వర్మకు అవకాశం దక్కలేదు. అదే సమయంలో పవన కల్యాణ్ సోదరుడు నాగబాబుకు మొన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి దక్కింది. దీంతో వర్మ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారంటూ కొందరు ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని పట్టుకున్న వైసీపీ సోషల్ మీడియా వర్మ టీడీపీపై అసంతృప్తితో ఆ పార్టీని వీడి వైసీపీలో చేరిపోతారని చెబుతోంది.

ఇదిలా ఉంటే… పిఠాపురంలోని ఓ మురికి కాలువ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వర్మ..దాని గురించి అధికారులు పట్టించుకోవాలని కోరారు. వర్మ హ్యాండిల్ నుంచి కనిపించిన ఈ పోస్టును చూసినంతనే వైసీపీ సోషల్ మీడియా మరింతగా రెచ్చిపోయింది. వర్మ ఇక వైసీపీలో చేరిపోయినట్లేనని గడచిన రెండు రోజులుగా ఊదరగొట్టేస్తోంది. అంతేకాకుండా ఎవరూ అడక్కుండానే… వర్మకు పిఠాపురం టికెట్, గీతకు రాజమండ్రి ఎంపీ టికెట్ అంటూ తనకు తానే ప్రశ్న, సమాధానం ఇచ్చుకుంటూ పోస్టులు పెడుతోంది. ఈ పోస్టులు ఇతరులను ఏ రీతిన ఆకట్టుకుంటున్నాయో తెలియదుగానీ.. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కొందరిని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయట. 2029లో టికెట్ ఇప్పుడే ఇచ్చేసి… వర్మతో ఎమ్మెల్యేగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారా? అంటూ వైసీపీ యాక్టివిస్టులే కామెంట్లు చేస్తున్నారు.