టీడీపీ నాయకుడు, ఎస్సీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం మరింత ముదిరింది. ఆయన పార్టీనే టార్గెట్ చేస్తూ.. అల్టిమేటం జారీ చేయడం.. పార్టీకి సవాళ్లు విసరడం వంటివి దుమారం రేపుతున్నాయి. తిరువూరు ఎమ్మెల్యేగా తొలిసారి విజయం దక్కించుకున్న స్వయంప్రకటిత మేధావి.. కొలికపూడి.. అధిష్టానానికి 24 గంటల సమయం ఇవ్వడం.. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న రమేష్‌ను తప్పించాలని పట్టుబట్టడం వంటివి రాజకీయ వర్గాల్లోచర్చకు దారితీసింది.
అయితే.. ఈ వ్యవహారం వెనుక వైసీపీ ఉందన్న చర్చ ఇప్పుడు తెరమీదికి వచ్చింది. కొలికపూడిని ఎవరో ఆడిస్తున్నారన్నది పార్టీ అధిష్టానానికి కూడా చేరిన అంశం. ఈ విషయంపైనే ఇప్పుడు పార్టీ దృష్టి పెట్టిం ది. స్థానికంగావ్యాపారాలు చేసుకునే వైసీపీ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని.. కూడా పార్టీకి అందిన సమాచారం. అందుకే.. సొంత పార్టీపై కొలికపూడి రెచ్చిపోతున్నారని.. నెట్టెం రఘురాం వంటి సీనియర్లు చెబుతున్నారు.
ఈ పరిణామాలతో కొలికపూడి వైసీపీ బాటపట్టే అవకాశం ఉందన్న చర్చకు కూడా తెరలేచింది. పార్టీ ఏదై నా సీరియస్ యాక్షన్ తీసుకుంటే..ఆయన వైసీపీ కండువా కప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఆన్‌లైన్ సహా ఆఫ్ లైన్ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. అయితే.. వీటిని కొలికపూడి ఎక్కడా ఖండించకపోవడం గమనార్హం. దీనిని బట్టి కొలికపూడి ప్లాన్-బీని రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై క్లారిటీ లేదు. ఇదిలావుంటే.. కొలికపూడి నిజంగానే వైసీపీ బాట పడితే ఏం చేయాలన్నది కూడా టీడీపీఆలోచన చేస్తోంది.
కొలికపూడిని అనర్హుడిగా ప్రకటించడం పెద్ద సమస్య కాదు. అసెంబ్లీలో కూటమి పార్టీలకు..బ లమైన మె జారిటీ ఉంది. ఒక ఎమ్మెల్యే పోయినా.. ఇబ్బంది లేదు. కానీ, ఇది సాధ్యమేనా? అన్నది చర్చ. ఎందుకంటే .. సొంత పార్టీ నాయకుడి మాట ఎలా ఉన్నప్పటికీ.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఆయన పై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. ఇబ్బందులు తప్పవు. అందుకే ఈ వ్యవహారం ఇబ్బందిగా మారింది. మరోవైపు.. పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచన ఉన్నా.. అది కూడా సమస్యగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి హెచ్చరించి వదిలేస్తారన్న చర్చ సాగుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి.