తెలుగు దేశం పార్టీ… భారత రాజకీయాల్లో ఓ సంచలనం. తెలుగు నేల రాజకీయాల్లో ఓ మార్పు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు దిక్సూచీ. కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలికిన తేజోమయం. బడుగులకు చట్టసభల్లోకి ప్రవేశం కల్పించిన చైతన్య దీప్తి. సంక్షేమం అంటే ఇదీ అంటూ యావత్తు దేశానికే దారి చూపిన మార్గదర్శి. రాజకీయం అంటే పెత్తనం కాదు…సేవ చేసే గుణం అని చాటిచెప్పిన గురుమూర్తి…ఇలా చెప్పుకుంటూ పోతే… దానికి అంతే ఉండదని చెప్పాలి. నిజంగానే దేశ రాజకీయ చరిత్రను ఓ మలుపు తిప్పిన తెలుగు దేశం పార్టీకి నేటితో 43 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల గుండెలు ఉప్పొంగే రోజిది. ఎన్నో ఆటుపోట్లకు తట్టుకుని గెలిచి నిలిచిన పార్టీకి అండాదండగా నిలిచిన కార్యకర్తలు సంబరాలు చేసుకునే రోజిది.
టీడీపీ ఆవిర్భావం సందర్భంగా తెలుగు నేలలో ఆ పార్టీ శ్రేణులు శనివారం పెద్ద ఎత్తున ఆవిర్భావ వేడుకలను నిర్వహి స్తున్నాయి. వెరసి తెలుగు నేలలో శనివారం పచ్చ పండుగకు తెర లేసింది. ఎక్కడ చూసినా పసుపు జెండాలు రెపరెప లాడుతూ సగర్వంగా తెలుగోడి ఆత్మ గౌరవాన్ని చాటి చెబుతున్నాయి. ఢిల్లీ నడి వీధుల్లో తెలుగు ఆత్మ గౌరవానికి తూట్లు పడుతున్నాయన్న ఒకే ఒక భావనతో సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున 1982 మార్చి 29న భాగ్యనగరి హైదరా బాదులో నాటి తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు చేతుల మీదుగా తెలుగు దేశం పార్టీ పురుడు పోసుకుంది. హైదరాబాదులో టీడీపీ ఇలా పురుడుపోసుకుందో లేదో… అలా నాడు వివిధ రంగాల్లో ఉజ్వల భవిష్యత్తు తమదేనని సాగుతున్న వారిలో చాలా మంది తమ రంగాలకు వీడ్కోలు పలికి ఎన్టీఆర్ వెంట సాగారు. నేడు తెలుగు నేల రాజకీయాల్లో కీలక నేతలుగా ఎదిగారు. ప్రజా సేవలో ఒదిగిపోయారు.
43 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. పార్టీ ఆవిర్భవించిన 9 నెలల వ్యవధిలోనే సొంతంగా ఉమ్మడి ఏపీలో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న టీడీపీ… ఆ వెంటనే కుంపటి కొట్లాటలతో ఇబ్బంది పడింది. అయినా కూడా ఆ గోలకు ఇట్టే స్వస్తి చెప్పేసి తన బలమేంటో చెప్పేసింది. ఆ తర్వాత ఓ కొత్త పార్టీ అయినప్పటికీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించే దిశగా సత్తా చాటిన టీడీపీ… దేశ రాజకీయాలను సమూలంగా మార్చేసే దిశగా ప్రణాళికలు రచించి వాటిని పక్కాగా అమలు చేసి కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి వీడ్కోలు పలికింది. దేశానికి ఎందరో నూతన నేతలను ప్రదానులుగా చేసింది. రాజకీయ వాసనలే లేని విద్యాధికులను రాష్ట్రపతులను చేసింది. కుహనా రాజకీయాలు చేసే దురంహకారులకు రాజకీయంగానే బుద్ధి చెప్పి తన స్థానిక బలమేమిటో చెప్పేసింది. ఇలా ఎన్నెన్నో ఆటుపోట్లను చవిచూసిన టీడీపీ… నేడు ఏపీలో అదికార కూటమికి రథ సారథిగానే కాకుండా… జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలోనూ కీలక భాగస్వామిగా కొనసాగుతుండటం గమనార్హం.
టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివార తెల్లారగట్లే పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నేళ్ల పార్టీ ప్రస్థానానికి కార్యకర్తల దీక్షాదక్షతలే కారణమంటూ ఆయన పార్టీకి మూలం కార్యకర్తలేనని తేల్చి చెప్పారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా… తెలుగు వారిని అభివృద్ధి పథాన నడిపిన జెండా కూడా టీడీపీదేనని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా పార్టీకి భవిష్యత్తు నేతగా ఎదుగుతున్న మంత్రి నారా లోకేశ్ కూడా పార్టీ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా ప్రభావితం చేయలేనంత స్థాయిలో ప్రజా జీవితాలను ప్రభావితం చేసిన పార్టీగా తెలుగు దేశం పార్టీకి గుర్తింపు దక్కిందంటూ లోకేశ్ తన సందేశంలో పేర్కొన్నారు. బడుగులను అన్ని రకాలుగా అక్కున చేర్చుకున్న పార్టీగా కూడా ఒక్క టీడీపీకే గుర్తింపు దక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు.