రాయలసీమ జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం బ్రేకులు వేసింది. కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం ప్రాంతంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని నిర్మాణ వ్యయం సుమారు రూ. 3600 కోట్లవుతుందని అంచనాలు కూడా రెడీ చేశారు. పరిపాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చేశారు. ఇక టెండర్లు పిలవటమే ఆలస్యం అన్న పరిస్దితులో జాతీయ హరిత ట్రైబ్యునల్ అడ్డుపడింది.
ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని ఓ రైతు చేసిన ఫిర్యాదు ఆధారంగా ట్రైబ్యునల్ విచారణ జరిపింది. విచిత్రమేమిటంటే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గతంలోనే కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖతో పాటు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు అనుమతులు ఇచ్చేశాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ ద్వారా ఇప్పటికే తెలుగుగంగప్రాజెక్టు, గాలేరు-నగిరి పథకం ద్వారా సాగు, తాగు నీరందుతోంది. కాకపోతే పై ప్రాజెక్టుల ద్వారా ఉన్న ఆయకట్టును స్ధిరీకరించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమ+నెల్లూరు జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరందుతుంది. సరే ఎవరి వాదన ఎలాగున్నా ఓ రైతు వేసిన కేసు వల్ల మొత్తం వ్యవహారాన్ని ట్రైబ్యునల్ విచారణ జిరిపింది. ఇదే విషయమై పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని స్పష్టంగా ఆదేశించింది. ట్రైబ్యునల్ తాజా ఆదేశాల ప్రకారం కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాల్సుంటుంది. మొత్తంగా ప్రాజెక్టును కట్టేందుకు లేదని ట్రైబ్యునల్ చెప్పలేదు. కాకపోతే డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతో పాటు పర్యావరణ అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేసుకోమని మాత్రమే చెప్పింది. దీనివల్ల కొంత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయంతే.
ఏదేమైనా ప్రాజెక్టు నిర్మాణాన్ని అనుకున్నది అనుకున్నట్లు మొదలుకాకపోతే దాని అంచనా వ్యయాలు పెరిగిపోతాయన్న విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ రివైజుడు ఎస్టిమేట్లని, అదనపు బడ్జెట్ అవసరమని ఇలా రకరకాల పద్దతుల్లో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవటం ఖాయం. మామూలుగా ప్రస్తుత అంచనాల ప్రకారమైతే 2023కల్లా ప్రాజెక్టు పూర్తవ్వాలి. ఇపుడు మరో ఏడాది ఆలస్యమయ్యే అవకాశముందంతే. చూద్దాం పర్యావరణ అనుమతులు ఎప్పటిలోగా కేంద్రం ఇస్తుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates