ఆశ చావలేదు.. జాబితా వచ్చేదాకా ఆగేది లేదు

తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు ప్రతిపాదించిన జాబితాను పరిశీలించిన అధిష్ఠానం.. తమ వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరిచి… అంతిమంగా ఓ ఫైనల్ లిస్ట్ ను వారి చేతిలో పెట్టినట్గుగా కథనాలు వచ్చాయి. అయితే ఆ జాబితాలో ఎవరి పేర్లున్నాయన్న విషయం మాత్రం బయటకు రాలేదు. దీంతో మంత్రి పదవులను ఆశిస్తున్న వారు ఇంకా తమ యత్నాలను సాగిస్తూనే ఉన్నారు. హైదరాబాద్, ఢిల్లీ మధ్య చక్కర్లు కొడుతున్న హస్తం పార్టీ నేతలు ఢిల్లీలో పార్టీ అధిష్ఠానం పెద్దలను కలుస్తూ తమ ఆశలు, ఆకాంక్షలను వారి ముందు పెడుతున్నారు.

తాజాగా అలాంటి భేటీనే ఒకటి జరిగింది. వరంగల్ జిల్లాకు చెందిన నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దొంతి మాధవరెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. పార్టీ పెద్దలను కలిసే నిమిత్తమే ఢిల్లీ వెళ్లిన ఆయన ఇప్పటికే పార్టీ జాతీయ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ లను ఆయన కలిశారు. తనకు మంత్రి పదవి కేటాయించాలన్న తన డిమాండ్ ను వారి ముందు పెట్టారు ఈ సందర్బంగా ఆయన ఓ కీలక అంశాన్ని వారి ముంద పెట్టారట. ఆ విషయాన్నివిన్నంతనే వారు నిజమా? అంటూ నోరెళ్లబెట్టారట.

తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే కాకుండా ప్రస్తుతం కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా నష్టమేమీ జరగలేదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే.. గడచిన పదేళ్లు మినహాయిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ది రాజయోగమేనని కూడా చెప్పాలి. అలాంటిది నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ గెలిచి 2023 నాటికి ఏకంగా 56 ఏళ్లు అవుతుందట. అప్పుడెప్పుడో 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి గెలిస్తే.. ఆ తర్వాత అక్కడ కాంగ్రెస్ గెలిచిందే లేదు. మధ్యలో కమ్మూనిస్టులు, స్వతంత్రులు కూడా గెలిచినా… కాంగ్రెస్ మాత్రం రాణించలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాధవరెడ్డి కూడా 2014లో ఇండిపెండెంట్ గా విజయం సాధించారు.

ఈ లెక్కన కాంగ్రెస్ కు నర్సంపేటలో అర్థ శతాబ్ధం తర్వాత జెండా నిలబెట్టిన నేతగా దొంతి మాధవ రెడ్డి తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. 56 ఏళ్ల తర్వాత పార్టీ జెండాను ఎగురవేసిన తనకు కాకుంటే…ఇంకెవరికి మంత్రి పదవి ఇస్తారని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఇదే విషయాన్ని ఆయన అదిష్టానం పెద్దల వద్ద కూడా ఓ మోస్తరు లైటర్ వేలో చెబుతున్నారట. మొత్తంగా తన ప్రత్యేకతను తానే చెప్పుకుంటూ మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న మాదవ రెడ్డి చివరకు ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తారో చూడాలి. ఇక మాధవరెడ్డి మాదిరిగా ఇంకెందరు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారోనన్న దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.