వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య కారణాల రీత్యా జగన్ పెద్దమ్మ సుశీలమ్మ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 85 ఏళ్ల వయసున్న సుశీలమ్మ వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా సతమతమవుతున్నారు. చాలా కాలంగా ఆమె పులివెందులలోని ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితమే సుశీలమ్మను పరామర్శించే నిమిత్తం ఆమె చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రికి వెళ్లి మరీ ఆమెను పలకరించారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నయ్య ఆనంద్ రెడ్డి సతీమణే సుశీలమ్మ. ఆనంద్ రెడ్డి ఇదివరకే మృతి చెందారు. తాజాగా సుశీలమ్మ మృతి చెందారు. గురువారం పులివెందులలోనే ఆమె అంత్యక్రియలు జరిగే అవకాశాలున్నాయి. సుశీలమ్మ అంత్యక్రియలకు జగన్ కూడా హాజరు కానున్నారు. దీంతో గురువారం మరోమారు ఆయన పులివెందుల వెళ్లనున్నారు. ఇటీవలే తన దగ్గరి బంధువు చనిపోవడంతో బెంగళూరు నుంచి నేరుగా పులివెందుల వచ్చిన జగన్.. పనిలో పనిగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు.
ఇటీవలి కాలంలో జగన్ బంధువర్గంలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది చివరలో జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి చనిపోయిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే అభిషేక్ రెడ్డి మృతి చెందడం వైఎస్ ఫ్యామిలీని తీవ్ర విషాధంలో ముంచేసింది. తాజాగా ఇటీవలే జగన్ బాబాయి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ మృతి చెందిన సంగతి తెలిసిందే. పిచ్చమ్మ భౌతిక కాయానికి నివాళి అర్పించేందుకు జగన్ ఇటీవలే ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు సమీపంలోని మేదరమెట్లకు వెళ్లిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates