తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త చిచ్చు తెరమీదికి వచ్చింది. త్వరలోనే మంత్రి వర్గాన్ని విస్తరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పక్కా క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఏప్రిల్ 3వ తేదీన ముహూర్తం పెట్టినట్టు కూడా చర్చసాగుతోంది. దీంతో రేవంత్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ ఖాయంగా మారింది. అయితే.. ఈ విస్తరణలో చోటు దక్కించుకునేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు.
అయితే.. తాజాగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు.. తమకు కూడా చోటు ఇవ్వాలంటూ.. పార్టీ అధిష్టానానికి నేరుగా లేఖ సంధించారు. మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని.. తమకు న్యాయం చేయాలని వారు ఆలేఖలో పేర్కొనడం గమనార్హం. రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన 32 లక్షల మందికి పైగా ప్రజలు ఉన్నారని.. వారికి అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర సామాజిక వర్గానికి చెందిన మంత్రులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో తమకు అవకాశం కల్పించాలని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ అధిష్టానానికి మొర పెట్టుకున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఒకరిద్దరు మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు. మరోవైపు.. ఇదే ఎస్సీ వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామి పేరు కూడా మంత్రివర్గ జాబితాలో ఉన్నట్టు సమాచారం. అయినప్పటికీ.. మాదిగ వర్గం ఎమ్మెల్యేలు ఇలా లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనివెనుక.. వివేక్ ఒత్తిడి ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుండడం గమనార్హం. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.