ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రంగం సిద్ధం అయిపోయింది. 16 వేలకు పైగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ ఒకే దఫా భర్తీ చేసే దిశగా కూటమి సర్కారు ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకూ రంగం సిద్ధం అయిపోయింది. ఈ విషయంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాటి కలెక్టర్ల సదస్సులో కీలక ప్రకటన చేశారు.
ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఇటివలే ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ ఆధారంగానే ఈ డీఎస్సీని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగానే నియామకాలు చేపడతామని వివరించారు. ఏది ఏమైనా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నూతన విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి తప్పనిసరిగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
వాస్తవానికి మార్చి నెలాఖరులోగానే డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి కూటమి సర్కారు రంగం సిద్ధం చేసింది. అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వివిధ వర్గాల నుంచి అందిన వినతులు, అదే సమయంలో వర్గీకరణపై నియమించిన కమిటీ నివేదిక అందజేత, అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా ఆర్డినెన్స్ జారీ వంటి వరుస పరిణామాల కారణంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ తొలి వారానికి వాయిదా పడక తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా కూడా కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీని పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత రాదనే చెప్పాలి.