ఆయన పార్టీ మారారు. కానీ, పంథా మాత్రం మార్చుకోలేదు. ఆయనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఆయన ప్రజలకు చాలా చేరువైన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అంతేకాదు.. పార్టీ ఏదైనా ఆయన గెలుపు ఖాయమన్న మాట కూడా వినిపిస్తుంది. గత ఏడాది వైసీపీలో ఉన్న ఆయన.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు.. టీడీపీతీర్థం పుచ్చుకు న్నారు. అయినప్పటికీ.. గెలుపు గుర్రం ఎక్కారు. సాధారణంగా అనేక మంది ఇలా పార్టీలు మారి గెలిచినా.. కోటంరెడ్డి స్టయిలే వేరు. ఆయన ప్రజానేతగా.. నెల్లూరు రూరల్ ప్రజలకు ఆపద్బాంధవుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.
కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి కోటంరెడ్డిప్రజల సంక్షేమానికి ఎక్కువగా సమయం ఇచ్చేవారు. సొంత వ్యాపారాలు, వ్యవహారాలు ఉన్నా.. వాటి కంటే కూడా.. తను ప్రజలకు చేరువ కావడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. ఇలా ఆయన తనను తాను ప్రజలకు అంకితం చేసుకున్నారు. ఇది తర్వాత కాలంలో ఆయనను మరింత చేరువ చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజల కోసం పాదయాత్ర చేశారు. నియోజకవర్గంలో అభివృధ్ది కార్యక్రమాలను విరివిగా నిధులు తెచ్చుకున్నారు. తన మన తేడా లేకుండా.. అన్ని పార్టీల నాయకులను కలుపుకొని పోవడం, అభివృద్ధిలో భాగస్వాములను చేయడం కూడా కోటంరెడ్డికే చెల్లింది.
ఇక, వైసీపీ లో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. ఆయన మంత్రిని మించిన సేవలు అందించారు. నియోజకవర్గంపై పట్టు పెంచుకున్న ఆయన.. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు కూడా చేసి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఇదే గత ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చినా.. కూటమిలో చేరినా.. గెలుపు గుర్రం ఎక్కేలా చేసింది. వాస్తవానికి కూటమి ప్రభావం ఇతర నియోజకవర్గాలపై ఉన్నప్పటికీ.. నెల్లూరులో మాత్రం కోటం రెడ్డి హవాతోనే ఆయన విజయం దక్కించుకున్నారన్నది వాస్తవం. మనసులో తనకు మంత్రి పదవి దక్కలేదన్న బాధ ఉన్నా.. దానిని బయటకు కనిపించకుండా చేసిన సేవ ఓట్లు పడేలా చేసింది.
ఇక, తాజాగా కూడా.. ఆయన కూటమి సర్కారులో మంత్రి పదవిని ఆశించారు. కానీ, దక్కలేదు. అయినా.. ఆయన తన పంథాను మాత్రం మార్చుకోలేదు. ప్రజలకు చేరువ అయ్యేందుకు ఉన్న అన్ని మార్గాలనూ వినియోగించుకుంటూ ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇటీవల 30 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో రహదారులు నిర్మించారు. అదేవిధంగా పాఠశాలల్లోనూ ఏర్పాట్లు చేశారు. వాటిని ఆయన స్వయంగా పరిశీలించడం.. దీనికి పెద్దగా హంగు ఆర్భాటం లేకుండా.. చిన్న మోటార్ సైకిల్‌పై వెళ్లడం వంటివి.. కోటంరెడ్డికి మరింత కలిసి వస్తున్న అంశాలనే చెప్పాలి. ప్రజల్లో వ్యతిరేకత లేని ఎమ్మెల్యేగానే కాకుండా.. అవినీతి ఆరోపణలు లేని నాయకుడిగా కూడా.. కోటంరెడ్డి పేరు తెచ్చుకోవడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates