తెలంగాణ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ.. కీల‌క చ‌ర్చ‌లు!

తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సిద్ధ‌మైందా? ఆ దిశ‌గా వ‌డివ‌డిగా చ‌ర్య‌లు తీసుకునేందుకు రెడీ అయిందా? అంటే .. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేయాల‌న్న‌ది కొన్నాళ్లు గా వినిపిస్తున్న డిమాండ్‌. సుమారు నాలుగు నుంచి ఐదు కీల‌క శాఖ‌లు.. సీఎం రేవంత్‌రెడ్డి చేతిలోనే ఉన్నాయి. పైగా కీల‌కమైన హోం శాఖ కూడా ఆయ‌న చెంత‌నే ఉంది. ఈ నేప‌థ్యంలో మంత్రివ‌ర్గంపై ఆశ‌లు పెట్టుకున్న వారి నుంచి త‌ర‌చుగా ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. గ‌త రెండు మూడు మాసాల నుంచి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై అదిగో..ఇదిగో.. అంటూ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.

అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ విస్త‌ర‌ణ‌, లేదా ప్ర‌క్షాళ‌న వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. అయితే.. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో ఎదురు దెబ్బ త‌గ‌ల‌డం.. మ‌రోవైపు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై మ‌రింత గ‌ట్టిగా పోరాడాల్సిన నేప‌థ్యంలో సీనియ‌ర్ల‌ను దారిలో పెట్టుకునేందుకు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌న్న వాద‌న ఇటీవ‌ల కాలంలో ఎక్కువైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తాజాగా ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, పార్టీ అగ్ర‌నేత, ఎంపీ రాహుల్‌గాంధీలు.. ప్ర‌త్యేకంగా తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం ప‌లువురు మంత్రుల‌తో ఢిల్లీలో భేటీ అయ్యారు. వాస్త‌వానికి ఇప్పుడు ఇంత అర్జంటుగా చ‌ర్చించాల్సిన అంశాలు ఏమీ లేన‌ప్ప‌టికీ.. ఈ స‌మావేశం ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం.

దీంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పైనే తాజాగా స‌మావేశం ఏర్పాటు చేశార‌ని.. రాష్ట్ర స్థాయిలో చ‌ర్చ సాగుతోంది. సోమ‌వారం ఉద‌యం స‌మాచారం రావ‌డంతో ఆ వెంట‌నే సీఎం, డిప్యూటీ సీఎం.. మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. పార్టీ ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ కూడా ఈ స‌మావేశంలో పాల్గొన‌డంతో ఖ‌చ్చితంగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పైనే ఈ చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌న్న విశ్వాసం వ్య‌క్త‌మ‌వుతోంది. కాగా.. ఇప్ప‌టికే మంత్రివ‌ర్గంలోకి చేరాల‌నుకునే వారి జాబితా పార్టీ అధిష్టానానికి ఎప్పుడో చేరిపోయింది. సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు సుమారు 12-15 మంది పేర్ల‌తో ఈ జాబితా ఉండ‌డం గ‌మ‌నార్హం. వీరిలో న‌లుగురు మ‌హిళ‌ల పేర్లు కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. ఇక‌, ఈ జాబితాలో మండ‌లి నుంచి ఇద్ద‌రు ఉన్నార‌ని గ‌తంలోనే ప్ర‌చారం జ‌రిగింది.

పున‌ర్విభ‌జ‌న‌పై కూడా..

పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై ఇటీవ‌ల త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ నిర్వ‌హించిన అఖిల ప‌క్ష స‌మావేశం హిట్ కొట్టింది. ఈ స‌మావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు.. కూడా హాజ‌ర‌య్యారు. ఈ నేప‌థ్యంలో పున‌ర్విభ‌జ‌న‌పై పోరును మ‌రింత తీవ్ర‌త‌రం చేసే దిశ‌గా కూడా..ఈ స‌మావేశంలో చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం. ఏదేమైనా.. ముఖ్యంగా మంత్రివ‌ర్గ కూర్పుపైనే ప్ర‌స్తుత స‌మావేశం ఎక్కువ‌గా దృష్టి పెట్టింద‌ని.. దీని త‌ర్వాత ప్రాధాన్య‌తాంశంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశం ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.