తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండానే సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన ఏపీ… టీడీపీ నేతృత్వంలో అన్నీ సమకూరిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రానికి నూతన రాజధానిగా ఎంపిక అయిన అమరావతికి నిధులే కాదు… విద్యాలయాలు కూడా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రసిద్ధ విద్యా సంస్థల్లో కొన్ని తమ క్యాంపస్ లను అమరావతిలో ఏర్పాటు చేశాయి. ఫలితంగా భవిష్యత్తులో అమరావతితో పాటుగా ఏపీ కూడా విద్యా కేంద్రంగా మారనుంది. ఈ విషయాన్ని ప్రసిద్ధ విద్యా సంస్థలూ గుర్తించినట్టున్నాయి. అందుకే ఆ సంస్థలూ ఏపీకి వచ్చేస్తున్నాయి. అందులో సోమవారం తొలి అడుగు పడింది. జార్జియన్ నేషనల్ వర్సిటీ ఏపీలో ఓ అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జార్జియన్ నేషనల్ వర్సీటీ ప్రతినిధి బృందం..రాష్ట్ర విద్యా శాఖతో సోమవారం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఏపీలోని ఉత్తరాంధ్రలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఓ అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. అందుకోసం ఆ వర్సిటీ ఏకంగా రూ.1,300 కోట్లను వెచ్చించనుంది. ఈ వర్సిటీ ద్వారా రాష్ట్రంలోని యువతకు 500 మేర ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. ఈ వర్సిటీ ద్వారా రాష్ట్ర విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలతో కూడిన విద్యాబోధన కూడా లభించనుంది. ఈ ఒప్పందంపై నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
అమరావతిని నూతన రాజధానిగా తన గత పాలనలోనే చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో ఉత్తరాంధ్రలోని సాగర నగరం విశాఖను రాష్ట్రానికి వాణిజ్య రాజధానిగా తీర్చిదిద్దేందుకు పకడ్బందీ చర్యలకూ శ్రీకారం చుట్టారు. విశాఖకు వెన్నుదన్నుగా నిలిచే దిశగా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టునూ అభివృద్ది చేస్తున్నారు. ఈ విషయాన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలోనే జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ… ఉత్తరాంధ్రలో తన అంతర్జాతీయ స్థాయి విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసినట్లుగా సమాచారం. ఈ వర్సిటీ ప్రతిపాదనను స్వాగతించిన లోకేశ్… ఆ వర్సిటీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు.