వైసీపీ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వంతు వచ్చింది. ఆయన గతంలో ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్లు.. నకిలీవని, ఆయన పదో తరగతి కూడా పాస్ కాలేదని.. విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆమదాలవలస నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే, తమ్మినేని బావమరిది కూన రవి కుమార్.. ఈ విషయంపై పట్టుబట్టారు. దీంతో వైసీపీ హయాంలోనే ఆయనపై డిగ్రీ సర్టిఫికెట్లకు సంబంధించి భారీ విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.
పైగా.. ఆయన ఊరూ పేరు లేని సంస్థ నుంచి డాక్టరేట్ కూడా చేస్తున్నట్టు చెబుతున్నారని అప్పట్లోనే కూన విమర్శించారు. ఈ విమర్శలను వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన్ లైట్ తీసుకున్నారు. కానీ, ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. తాజాగా ఈ వ్యవహారాన్ని వెలికి తీశారు. మరోసారి ప్రభుత్వానికి కూన ఈ విషయంపై విన్నపాలు సమర్పించారు. అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి అబద్ధాలు ఆడిప్రజలను మోసం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై విచారణకు ఆదేశించాలని కూన ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. తమ్మినేని విద్యార్హతలు, ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు.. వంటివాటిని పరిశీలించనుంది. అదేవిధంగా ఆయన చదివిన పాఠశాల, పదోతరగతి, ఇంటర్‌లో ఆయనకు వచ్చిన మార్కులు, అలానే ఏ కాలేజీ నుంచి ఆయన డిగ్రీ చేశారు. ఆయనకు ఏ సంస్థ డాక్టరేట్ చేసే అవకాశం ఇచ్చిందన్న అంశాలపై కూపీ లాగనున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు 15 రోజుల్లోనే విజిలెన్స్ అధికారులు తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం.. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు.. తమ్మినేని ఇప్పటికీ.. తాను డాక్టరేట్ చేస్తున్నానని.. ఎవరైనా విచారించుకోవచ్చని చెబుతున్నారు.