బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. శ్యామలతో పాటుగా 8 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ వారికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరితో పాటు ఐదుగురు పోలీసుల విచారణకు హాజరయ్యారు. తాజాగా సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శ్యామల పోలీసుల విచారణకు హాజరయ్యారు.
బెట్టింగ్ యాప్ ల కేసులో పోలీసులు తనను ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భావనతో శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శ్యామల పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు… శ్యామలకు అరెస్టును నుంచి విముక్తి కల్పిస్తూ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు తన న్యాయవాదిని వెంటబెట్టుకుని సోమవారం ఉదయం శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపుగా 3.5 గంటల పాటు శ్యామలను పోలీసులు విచారించారు. ఆ తర్వాత ఆమెను పంపేశారు.
విచారణ సందర్బంగా శ్యామల సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించినట్లుగా సమాచారం. అంతేకాకుండా శ్యామల మొబైల్ ఫోన్ ను కూడా పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఇప్పటిదాకా ఎన్నిబెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేశారని శ్యామలను ప్రశ్నించారు. అంతేకాకుండా ఆ ప్రచారం ద్వారా బెట్టింగ్ యాప్ ల ద్వారా ఎంతమొత్తం ఆర్జించారన్న వివరాలను కూడా ఆమె నుంచి సేకరించారు. ఈ సందర్బంగా శ్యామల బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మీడియాతో మాట్లాడిన శ్యామల.. ప్రస్తుతానికి తానేమీ మాట్లాడలేనని తెలిపారు. పోలీసుల విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని ఆమె తెలిపారు.