వైసీపీని, జగన్‌ను కూడా కాదనుకుని.. ఏపీ ప్రజలు కూటమికి ముఖ్యంగా చంద్రబాబుకు భారీ మెజారిటీ ఇచ్చి ఎందుకు గెలిపిం చారో.. ఇప్పుడు అర్ధమవుతోందని అంటున్నారు మేధావులు. పాలనపరంగానే కాకుండా.. శాఖల వారీగా కూడా.. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు.. అనుక్షణం ఆయన దృష్టి పెడుతున్న విధానాలను వారు ప్రస్తావిస్తున్నారు. గతంలో వైసీపీ అధినేత, సీఎం జగన్.. పాలనపై పట్టుకన్నా.. పేరుపై పట్టు పెంచుకునేందుకు.. తన పేరు వేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారన్న విష యం తెలిసిందే. ఏం జరిగినా.. అందులో ఆయన పేరును ఇరికించేందుకు ప్రయత్నించేవారు తప్ప.. పాలనపై పెద్దగా పట్టించుకోలేదు.
ఈ పరిణామం కూడా.. వైసీపీ ఘోర పరాజయానికి మరో ముడిసరుకుగా వినియోగపడింది. అయితే.. చంద్రబాబు స్టయిలే వేరు. ఎక్కడ ఏం జరిగినా.. ఆయనకు తెలియాల్సిందే. ఎక్కడ ఎలాంటి సమాచారం ఉన్నా.. తనదృష్టికి రావాల్సిందే.. అన్నట్టుగా ఆయన సర్కారుపై తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు చాలా బిజీగా ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ.. అంత బిజీలోనూ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మరో 9 రోజుల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం(మార్చి 31) ముగిసిపోనుంది. దీంతో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులు, వచ్చే నెల ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలపై చంద్రబాబు సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
అంతేకాదు.. కీలకమైన కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు.. ఈ నెల 31 దాటితే మురిగిపోయే వనరులు.. ఇలా ఏ ఒక్క అంశాన్నీ ఆయన వదిలి పెట్టలేదు. శనివారం సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఆ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయి.. కేంద్రం నుంచి రావాల్సిన సొమ్ములు, బకాయిలను తక్షణమే రప్పించుకు నేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు.. అవసరమైతే.. రాత్రికి రాత్రి.. ఢిల్లీ వెళ్లి ఆర్థిక శాఖపై ఒత్తిడి పెంచాలని కూడా మంత్రికి సూచించారు. దీంతో అధికారులు ఈ ప్రయత్నాల్లో ముమ్మరంగా దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది.
గతంలో వైసీపీ హయాంలో జగన్ ఇవేవీ పట్టించుకునే వారు కాదు. సాయంత్రం 6 తర్వాత.. తాడేపల్లి గేట్లు మూసేసేవారు. దీంతో అధికారులు కూడా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించారు. ఫలితంగా రెండు మూడు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం నుంచిరావాల్సిన గ్రాంట్లు, నిధులు.. రాకపోగా, మురిగిపోయాయి. వీటిని సకాలంలో గుర్తించి రప్పించుకుని ఉంటే.. కొంత వరకు అప్పులు తగ్గేవన్న చర్చ కూడా అప్పట్లో జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు జగన్ మాదిరిగా కాకుండా.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై భూతద్దం పట్టుకుని మరీ వెతికి రూపాయి కూడా వదులుకోకుండా ప్రయత్నాలు చేయడం గమనార్హం.