వీడియో : జైలు నుండి పోసాని విడుదల

టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపుగా నెల రోజులకు కాస్త అటుఇటుగా ఏపీలోని వివిధ జైళ్లలో కాలం వెళ్లదీయాల్సి వచ్చిన పోసాని… శనివారం సాయంత్రం బెయిల్ షరతుల మేరకు జామీన్లు సమర్పించి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన పోసానిని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా పోసాని తీవ్ర భావోద్వేగానాకి గురయ్యారు.

టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అసభ్యపదజాలంతో దూషించారంటూ ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పోసానిపై ఏకంగా 16 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో తొలుత అన్నమయ్య జిల్లా పోలీసులు తమ చర్యలను ప్రారంభించారు. పవన్ దూషించి తమ మనోభావాలను దెబ్బతీశారంటూ అందిన ఓ ఫిర్యాదు ఆదారంగా అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె పీఎస్ కేసు నమోదు కాగా… అదే కేసులో ఆయనను అన్నమయ్య జిల్లా పోలీసులు ఫిబ్రవరి 26న హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేశారు.

ఈ కేసులో కొన్నాళ్లు రాజంపేట జైలులో ఉన్న పోసానిని ఆ తర్వాత పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు, ఆ తర్వాత కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు… తదనంతరం గుంటూరులోని సీఐడీ పోలీసులు తమ అదుపులోకి తీసుకుని సవంబంధిత జైళ్లకు తరలించారు. అయితే కొన్ని కేసుల్లో బెయిల్, మరికొన్ని కేసుల్లో అరెస్టు కాకుండా మినహాయింపు పొందిన పోసాని రిలీజ్ అవుతారన్న సమయంలో అనూహ్యంగా సీఐడీ అదికారులు అరెస్టు చేశారు. ఈ కేసులోనూ శుక్రవారం బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో బెయిల్ షరతుల మేరకు జామీన్లు సమర్పించిన పోసాని శనివారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.