కూట‌మి మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌.. ఇప్పుడు సాధ్యమేనా?

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం.. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేస్తుందా? లేక‌.. మంత్రివ‌ర్గంలో కూర్పు వ‌ర‌కు ప‌రిమితం అవుతుందా? అంటే.. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. కూర్పు వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంద‌న్న‌వాద‌న ఓ వైపు వినిపిస్తోంది. కానీ, నాణేనికి మ‌రో కోణం అన్న‌ట్టుగా.. ప్ర‌క్షాళ‌న చేయొచ్చ‌న్న స‌మాచారం కూడా వ‌స్తోంది. దీంతో మంత్రి ప‌దువులు ఆశించే సీనియ‌ర్ నాయ‌కులు.. జూనియ‌ర్ ఎమ్మెల్యేలు కూడా.. క్యూ క‌ట్టేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో దీనికి ప్ర‌త్యేకంగా ఓ డ్యాష్ బోర్డును అన‌ధికారికంగా అమ‌లు చేస్తున్నారు. సీఎంవోకు వ‌స్తున్న‌వారు..తమ వివ‌రాలు.. పార్టీకి చేసిన సేవ‌ల‌ను వివ‌రిస్తూ.. పుస్త‌కాల్లో త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకుంటున్న‌ట్టు తెలిసింది. వాస్త‌వానికి ప్ర‌స్తుతం ఉన్న మంత్రివ‌ర్గంలో ఒక్క సీటు మాత్ర‌మే ఖాళీగా ఉంది. అది కూడా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు, ఇటీవ‌ల ఎమ్మెల్సీగా విజ‌యం ద‌క్కించుకున్న నాగ‌బాబుకు ఇస్తార‌న్న ప్ర‌చారం ఉంది. దీనిని గ‌తంలో సీఎం చంద్ర‌బాబే చెప్పుకొచ్చారు.

అయితే.. ఇదేస‌మ‌యంలో ప్ర‌క్షాళ‌న‌కు కూడా అవ‌కాశంఉంద‌న్న చ‌ర్చ సాగుతోంది. మంత్రుల ప‌నితీరుపై కొన్ని రోజుల కింద‌ట సీఎం చంద్ర‌బాబు పెద్ద నివేదిక‌ను విడుద‌ల చేశారు. దీనిలో చాలా వ‌ర‌కు అంటే.. ముగ్గురు నుంచి ఐదుగురు మంత్రుల వ‌ర‌కుప‌నితీరు స‌రిగా లేద‌ని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని.. ఎలానూ స‌ర్కారుకు 10 మాసాలు నిండుతున్న క్ర‌మంలో ఆ ముగ్గురు న‌లుగురిని మార్చేయ‌డం ఖాయ‌మ‌ని కూట‌మి పార్టీల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది.

దీంతో మూడు నాలుగు స్థానాలు ఖాళీ అయినా.. త‌మ‌కు అవ‌కాశం ద‌క్క‌క పోతుందా? అని చాలా మంది నాయ‌కులు లైన్‌లో నిల‌బ‌డ్డారు. ఇక‌, ఈ జాబితా వ్య‌వ‌హారం చంద్ర‌బాబు వ‌ర‌కు చేరింది. వాస్త‌వానికి ఆయ‌న జాబితాను తీసుకోవాల‌ని కానీ.. ఇలా సీఎంవోలోనే డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాల‌ని కానీ.. ఎవ‌రికీ చెప్ప‌లేదు. కానీ, నేత‌ల తాకిడి భ‌రించ‌లేని ఓ కీల‌క మంత్రి త‌మ త‌మ పేర్లు ఇవ్వాల‌ని నాయ‌కుల‌కు సూచించారు. దీంతో ఆశావ‌హులు క్యూ క‌ట్టారు. ఇక‌, ఈ జాబితాలో అంద‌రూ సీనియ‌ర్లే ఉండ‌డం.. ఎవ‌రిని క‌ద‌పాల‌న్నా.. పెద్ద యాగీ ఖాయ‌మ‌ని నిర్ధార‌ణ‌కు రావ‌డంతో చంద్ర‌బాబు మౌనంగా ఉండిపోయారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి. ఇక‌, ఉగాది త‌ర్వాత‌.. మంత్రివ‌ర్గంలో మార్పులు ఖాయ‌మన్న‌ది స‌మాచారం.