ఏపీలో విపక్షం వెనుక ఓ పక్కా ప్రణాళికతో వేసే ప్రతి అడుగును ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ వేయించే సంస్థ ఒకటి ఉండేది. అదే మనమంతా ఐ ప్యాక్ గా పిలుచుకునే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటి. ప్రశాంత్ కిశోర్ చేతుల్లో పురుడు పోసుకున్న ఈ సంస్థ నుంచి ఆయనే బయటికి వెళ్లిపోగా… ఆ తర్వాత కూడా ఈ సంస్థ సేవలను వైసీపీ వినియోగించుకుంది. దాదాపుగా పదేళ్లకు పైగా ఐ ప్యాక్, వైసీపీల మధ్య బంధం సాగింది. ఐ ప్యాక్ సేవలతోనే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి ఎదురు కాగానే… ఐ ప్యాక్ సేవలను వైసీపీ వద్దనుకుంది. ఇప్పుడు ఆ సంస్థ సేవలను వైసీపీ రద్దు చేసుకుంది. ఇకపై వైసీపీ ఏ సంస్థ సేవలను తీసుకుంటుందో తెలియదు గానీ…ఐ ప్యాక్ ను అయితే తన కాంపౌండ్ నుంచి గెంటేసింది.
గడప గడపకు వైసీపీ, కావాలి జగన్- రావాలి జగన్, ఒక్క ఛాన్స్, సిద్ధం, సిద్దమేనా?… ఇలా వైసీపీకి లెక్కలేనన్ని నినాదాలను ఐప్యాక్ అందించింది. గడప గడపకు వైసీపీ అనే నినాదం ఏపీలోని ప్రతి ఇంటికి ఆ పార్టీని దగ్గర చేసింది. తన సిద్ధాంతాలేమిటన్న దానిపై ప్రతి ఇంటిలో చర్చ జరిగేలా చేసింది. హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్తలను వదిలేస్తే…కాంగ్రెస్, న్యూట్రల్ జనాన్ని వైసీపీకి దగ్గర చేసింది. ఇక కావాలి జగన్- రావాలి జగన్ అనే నినాదం అయితే పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ ను నింపితే…2019 ఎన్నికల్లో జనమంతా గంపగుత్తగా వైసీపీకి ఓటేసేలా చేసింది. వైసీపీని అదికారంలోకి తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత సిద్ధమేనా? అన్న పోస్టర్లు కూడా ఓ రేంజిలో క్లిక్ అయినా కూడా… ఎందుకనో గానీ టీడీపీ ప్రచారం ముందు అంతగా ప్రచారం చూపలేకపోయాయి.
వాస్తవానికి వైసీపీతో పాటు టీడీపీకి కూడా ఐ ప్యాక్ నుంచి వచ్చిన వారే వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అయితే అపజయం ఎదురైనా కూడా టీడీపీ రాబిన్ శర్మ సేవలను కొనసాగిస్తుంటే… వైసీపీ మాత్రం పరాజయం దక్కిందన్న ఒకే ఒక్క కారణంతో ఐ ప్యాక్ సేవలకు వైసీపీ వీడ్కోలు పలికేసింది. మరి ఇప్పుడు ఐ ప్యాక్ లేని సమయంలో పార్టీ ప్రచారం మొత్తం పార్టీ సోషల్ మీడియా విభాగమే చూసుకోవాల్సి ఉంటుంది కదా. మరి ఆ విభాగం ప్రచారం ఇంకెంత మంది పార్టీ కార్యకర్తలను అడ్డంగా బుక్ చేసి పారేస్తుందోనన్న అంశంపై అప్పుడే ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.