దళిత సామాజిక వర్గంలో బీసీల మాదిరే చాలా కులాలు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి ఎస్సీలుగా పరిగణిస్తున్నాం. బీసీల మాదిరే తమకూ విడివిడిగా రిజర్వేషన్లు కావాలన్న మాదిగల డిమాండ్ కు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వెన్నుదన్నుగా నిలిస్తే… మాదిగలకు మద్దతు ఇస్తే వారికంటే సంఖ్యలో ఎక్కువగా ఉన్న మాలల ఓట్లు తనకు దక్కకుండా పోతాయోనన్న భయంతో వైైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఈ మాట అన్నది మరెవరో కాదు. ఎస్సీ వర్గీకరణ పేరిట ఉద్యమాన్ని మొదలుపెట్టి… తెలుగు నేలలో అన్ని కులాలకు ఆత్మగౌరవం నింపే దిశగా ఉద్యమాలకు ఊపిరిలూదిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఈ మాటలన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చంద్రబాబు, జగన్ ల మద్య ఉన్న తేడాలను విస్పష్టంగా బయటపెట్టారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్)ది తెలుగు నేలలో 30 ఏళ్ల ప్రస్థానం. 1990లలో ఎస్సీ రిజర్వేషన్లను.. ఆయా కులాల జానాభా ప్రాతిపదికగా విభజించి అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్ తో మంద కృష్ణ మాదిగ ఉద్యమాన్ని ప్రారంభించారు. మాదిగలంతా ఒక్కటై ఆయన వెంట నడిచారు. నాడు ఉమ్మడి ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నానాటికీ బలోపేతమవుతున్న ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని పరిశీలించిన చంద్రబాబు… న్యాయం వైపు నిలబడదామని తీర్మానించుకున్నారు. ఈ తరహా వైఖరి ద్వారా కొంతమేర నష్టం జరిగినా ఫరవా లేదన్న భావనతో ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి ఆయన మద్దతుగా నిలిచారు.
నాటి అసెంబ్లీలో అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి..ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేయించారు. దానిని కేంద్రానికి పంపారు. కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూడకుండా రాష్ట్రంలో బీసీల మాదిరే ఎస్సీల్లోని ఆయా కులాల జనాభాను ప్రాతిపదికగా తీసుకుని రిజర్వేషన్లను వర్గీకరించి అమలు చేశారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగానే నాడు ఓ ధీరోదాత్త నిర్ణయమేనని చెప్పాలి. అయితే కొన్ని వర్గాలు ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లి ఎస్సీ వర్గీకరణను నిలుపుదల చేయించాయి. అయితే చంద్రబాబు అమలు చేసిన ఆ నిర్ణయాన్ని పూర్తిగా మాత్రం రద్దుకు కోర్టు ఆదేశాలు ఇవ్వలేదు. బాబు అమలు చేసిన నిర్ణయంపై అధ్యయనం చేసి ఓ నివేదికను ఇవ్వాలంటూ జస్టిస్ ఉషా మెహ్రా కమిటీని నియమించింది. చివరకు ఆ కమిషన్ కూడా చంద్రబాబు నిర్ణయం సరైనదేనని తేల్చి చెప్పింది.
ఆ తర్వాత అడ్డంకులన్నింటినీ తొలగించుకుని ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు నుంచి ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకుంది. కోర్టు తీర్పును స్వాగతించిన చంద్రబాబు… తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఇన్నేళ్ల తర్వాత అయినా సుప్రీంకోర్టు ఒప్పుకుందని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి వాస్తవ పరిస్థితులను బయటకు తీసి… దానికి అనుగుణంగా రిజర్వేషన్లను వర్గీకరించి.. ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టారు. అంతేకాకుండా అసెంబ్లీలో మరోమారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవం తీర్మానం చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మంద కృష్ణ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా చంద్రబాబు నిలిచారని మంద కృష్ణ అన్నారు. అంటే…చంద్రబాబు న్యాయం వైపు నిలిచినట్టే కదా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తే తన పార్టీకి కొంతమేర నష్టం వాటిల్లుతుందని తెలిసి కూడా చంద్రబాబు న్యాయం వైపే నిలిచారన్నారు. అదే సమయంలో జగన్ మాత్రం ఏపీలో మాదిగల కంటే అదికంగా ఉన్న మాలల ఓట్లను దృష్టిలో పెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాల వైపు మొగ్గు చూపారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగానే నిలిచినా… ఏపీ వరకు వచ్చేసరికి ఓటు బ్యాంకు రాజకీయాలతో జగన్ తన వైఖరిని మార్చుకున్నారని ఆరోపించారు.