ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు తిరుగులేదా? ఆయన పాలనా ప్రభ మరింత విరాజిల్లుతోందా? అంటే.. ఔననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. సాధారణ ముఖ్యమంత్రులకు సైతం అందని ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కావడం.. దాదాపు 40 నిమిషాల పాటు ఇరువురు చర్చించడం వంటి పరిణామాలపై జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఏపీకి సంబంధింబి గేట్స్ ఫౌండేషన్ ద్వారా సుమారు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఈ సందర్భం గా సీఎం చంద్రబాబు సాధించారు. వాస్తవానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గేట్స్‌తో కలిసి మాట్లాడేందుకు పెట్టుబడులు సాధించేందుకు ప్రయత్నించారు. కానీ.. వారెవరికీ దక్కని అవకాశం సీఎం చంద్రబాబు దక్కడాన్ని జాతీయ మీడియా ప్రస్తావించింది. గతంలో ఉన్న అనుబంధం.. కలిసి పనిచేసిన నేపథ్యం .. వంటివి ఇప్పుడు చంద్రబాబుకు కలిసి వచ్చినట్టే పేర్కొంది.
అంతేకాదు.. ఈ పరిణామంతో ఏపీవైపు ప్రపంచ దేశాలు సైతం చూసేందుకు మరింత వెసులుబాటు కలిగినట్టయిందని మీడియా ప్రశంసించింది. ఇదిలావుంటే.. ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెడుతున్నా..ఏపీ వైపు చూడడంతోపాటు.. సీఎం చంద్రబాబు తీసుకున్న ఐటీ, ఏఐ, సాంకేతిక వృద్ధి వంటి కీలక అంశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు.. గేట్స్ రెడీ అయ్యారు. ఇది ఏపీ పరిణామాలను మరింత గా మార్చనుంది.
ఈ ప్రభావం రాష్ట్రంలో చంద్రబాబు హవాను వచ్చే 20 ఏళ్లపాటు చిరస్థాయిగా ఉంచేలా చేస్తుందని జాతీయ మీడియా భావిస్తుండడం గమనార్హం. వాస్తవానికి వయసు రీత్యా చంద్రబాబు 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండకపోయినా.. ఆయన పేరు, ఆయన దార్శనికత వంటివి మున్ముందు తరాలకు చేరువ అవుతాయని పేర్కొనడం గమనార్హం. గతంలో సైబరాబాద్ నిర్మాణం తర్వాత.. అటు తెలంగాణలోనూ.. ఇటు ఏపీలోనూ చంద్రబాబుపేరు మార్మోగిన విషయం తెలిసిందే.