బాబుతో భేటీ అద్భుతం: బిల్ గేట్స్

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. దాదాపుగా 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ గురించి బుధవారం ఆ సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు స్పందించారు. బిల్ గేట్స్ తో తాను సమావేశం అయ్యానని.. ఏపీ ప్రగతిలో కీలకం కానున్న ఈ బేటీ తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా ఈ భేటీపై బిల్ గేట్స్ కూడా స్పందించారు. చంద్రబాబుతో భేటీ అద్భుతంగా సాగించని బిల్ గేట్స్ పేర్కొనడం గమనార్హం.

బుధవారం చంద్రబాబుతో జరిగిన భేటీ, ఆ తర్వాత సదరు భేటీపై చంద్రబాబు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను చూసిన తర్వాత గురువారం ఉదయం బిల్ గేట్స్ స్పందించారు. చంద్రబాబు ట్వీట్ ను రీపోస్ట్ చేసిన గేట్స్..దానికి తన ప్రతిస్పందనను జోడించారు. చంద్రబాబుతో బేటీ కావడం ఆనందంగా ఉందన్న బిల్ గేట్స్… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తమ ఫౌండేషన్ కీలక ఒప్పందంపై సంతకం చేసిందని గుర్తు చేశారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో అధునాతన సాంకేతికతను వినియోగించుకుని పురోభివృద్ధి సాధించే లక్ష్యంతో సాగుతున్న ఏపీకి సహకారం అందించనున్నామని ఆయన పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా తదుపరి చర్యలపై ఇప్పటికే దృష్టి సారించినట్లుగా ఆయన తెలిపారు.

వాస్తవానికి బిల్ గేట్స్, చంద్రబాబుల స్నేహ బంధం ఇప్పటిది కాదు. ఎప్పుడో 1995లో మొదలైన వీరి స్నేహం కాలంతో పాటుగా బలపడుతూ వచ్చింది. నాడు ఉమ్మడి రాష్ట్రానికి సీఎం హోదాలో చంద్రబాబు… అతికష్టం మీద గేట్స్ అపాయింట్ మెంట్ సంపాదించారు. వారి తొలి భేటీ ఢిల్లీలోనే జరిగింది. ఓ రాజకీయ నేతగా ఉండి టెక్నాలజీని ప్రభుత్వ పాలనలో వినియోగించే దిశగా మాట్లాడుతున్న చంద్రబాబును బిల్ గేట్స్ అలా చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు కోరినట్లుగానే హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఏర్పాటైంది. దానిని చూసి దిగ్గజ సంస్థలన్నీ హైదరాబాద్ బాట పట్టాయి. బాబు, గేట్స్ బంధం కూడా అంతకంతకూ బలపడింది. ఇటీవలే దావోస్ లో కలిసిన సందర్బంగా ఏపీకి సాయం చేయాలంటూ బాబు కోరితే… రెండు నెలలు తిరక్కుండానే గేట్స్ రంగంలోకి దిగిపోయారు.