చాన్నాళ్ల తర్వాత తల్లి విజయమ్మను కలిసిన జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొంతకాలంగా తన తల్లి వైఎస్ విజయమ్మతో విభేదాలతో సాగుతున్న సంగతి తెలిసిందే. సరస్వతి పవర్ కంపెనీ షేర్ల బదలాయింపు వివాదంలో తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిలలు ఓ వర్గంగా నిలవగా..జగన్ తన సతీమణి వైఎస్ భారతి రెడ్డితో కలిసి మరో వర్గంగా నిలిచారు. ఇరు వర్గాలు షేర్ల బదలాయింపుపై ఏకంగా కోర్టుకు ఎక్కి మరీ వాదులాడుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా కాలంగా జగన్ తన తల్లి విజయమ్మతో కలిసిందే లేదు. తాజాగా మంగళవారం ఆయన తన తల్లి విజయమ్మను కలిశారు. కుమారుడిని చూసిన సంతోషంలో విజయమ్మ ఉప్పొంగిపోతే… తల్లి విజయమ్మను కలిసిన నేపథ్యంలో జగన్ కూ ఒకింత సాంత్వన లభించిందని చెప్పాలి.

తన చెల్లి వైఎస్ షర్మిలతో చాలా కాలంగా జగన్ కు రాజకీయ పరంగా విభేదాలు తలెత్తగా… వారిద్దరూ ఎడమొఖం పెడ మొఖంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య షర్మిల కుమారుడి వివాహం జరగ్గా… జగన్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగానూ అన్నాచెల్లెళ్ల మధ్య పెద్దగా మాటలు కలవలేదు. అయితే అన్నాచెల్లెళ్లు ఎప్పటికైనా కలవకపోతారా అన్నట్లుగా విజయమ్మ ఇద్దరినీ సమానంగానూ చూసుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే షేర్లపై షర్మిలతో జగన్ వాదులాటకు దిగారో… విజయమ్మ కూతురు వైపే నిలబడ్డారు. ఫలితంగా జగన్ తన తల్లికి దూరమైపోయారు. ఈ క్రమంలో చాలా కాలంగా ఆయన తన తల్లిని కలిసిందే లేదు.

ఇలాంటి నేపథ్యంలో సోమవారం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలిసినంతనే.. హైదరాబాద్ లో తన కూతురుతో కలిసి ఉంటున్న విజయమ్మ సోమవారం రాత్రికే ప్రకాశం జిల్లాలోని వైవీ సొంతూరు మేదరమెట్ల చేరుకున్నారు. తాజాగా మంగళవారం ఉదయం జగన్ కూడా మేదరమెట్ల వెళ్లి బాబాయి కుటుంబాన్ని పరమార్శించారు. ఈ సందర్భంగా ఆయన చాలా కాలం తర్వాత తన తల్లి విజయమ్మను చూశారు. చాన్నాళ్లకు కుమారుడు కనబడటంతో జగన్ ను విజయమ్మ అపురూపంగా చూసుకున్నారు. జగన్ కూడా తల్లి వద్దే నిలబడి..ఆమెతో మాట్లాడుతూ కనిపించారు. అక్కడి నుంచి వెనుదిరిగే సమయంలో ఆయన విజయమ్మ దీవెనలు తీసుకుని మరీ బయలుదేరారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వరల్ అవుతున్నాయి.