పిక్ ఆఫ్ ద డే.. జానారెడ్డితో కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు సభల్లోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో ఓ మోస్తరుగా సమావేశాలు జరుగుతుండగా… తెలంగాణ సమావేశాలు మాత్రం రసవత్తరంగా సాగుతున్నాయి. అదికార కాంగ్రెస్ తో…ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఢీ అంటే డీ అన్నట్లుగా సాగుతోంది. సీఎం రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా సభ సాగుతోంది. ఇలాంటి సమయంలో సోమవారం రెండు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న వైరివర్గం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కనిపించారు. కేటీఆర్, హరీశ్ రావులతో కలిసి ఓ విషయంపై ఆయన చర్చలు జరిపి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని మరిచిపోకముందే…అసెంబ్లీ ఆవరణలో మరో ఆసక్తికర దృశ్యం కనిపించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డితో కలిసి కేటీఆర్ ఫొటోలకు ఫోజు ఇచ్చారు. ఈ ఇద్దరు నేతల కలయిక ఇప్పుడు తెలంగాణలో ఆసక్తి రేకెత్తించింది.

అసెంబ్లీ సమావేశాల నుంచి కేటీఆర్ బయటకు వెళ్లిపోతున్న సమయంలో… జానా రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద జానా రెడ్డి కారు దిగుతున్న సమయంలోనే అదే గేటు ద్వారా కేటీఆర్ బయటకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో జానాను చూసినంతనే ‘హాయ్ అంకుల్” అంటూ కేటీఆర్ ఆయనను పలకరించారు. జానా కూడా కేటీఆర్ కు విష్ చేశారు. ఈ సందర్భంగా జానా వద్దకు వెళ్లిన కేటీఆర్… ఆయనను ఆలింగనం చేసుకుని…”మీకెక్కడ వయసు అయిపోయింది…మీరు సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నా” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో జానాతో సహా అక్కడి వారిలో నవ్వులు విరిశాయి.