పోసాని విష‌యంలో జ‌రిగింది చాలు.. ఇక‌, వ‌దిలేయండి: శివాజీ

వైసీపీ నాయ‌కుడు, సినీ న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళిపై ఏపీ పోలీసులు ప‌లు కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆయ‌న కుటుంబ స‌భ్యులు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై పోసాని నోరు చేసుకున్నారు. దూష‌ణ‌ల‌తో ఆయ‌న తెగ‌బ‌డ్డారు. అప్ప‌ట్లో అలా తిట్ట‌డాన్నే ఆయ‌న రాజ‌కీయం అనుకుని ఉంటారు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. ప‌లు జిల్లాల్లో పోసానిపై న‌మోదైన కేసులు వెలుగు లోకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల పోలీసులు ఆయ‌న‌ను సోష‌ల్ మీడియాలో దూష‌ణ‌ల కేసుల కింద అరెస్టు చేయ‌డం.. తెలిసిందే.

అయితే.. ఒక కేసులో బెయిల్ వ‌చ్చినా.. మ‌రో కేసులో అరెస్టు కావ‌డం.. ఆవెంట‌నే మ‌ళ్లీ జైల్లోకి వెళ్ల‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ నెల 26 వ‌ర‌కు ఆయ‌న జైల్లోనే ఉండ‌నున్నారు. ఈ విష‌యాన్ని తాజాగా సినీ న‌టుడు, రాజ‌కీయ విశ్లేష‌కుడు శివాజీ ప్ర‌స్తావించారు.

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు.. ఒక‌రిపై ఒక‌రు తిట్టుకుంటారని, అది వారికి కామ‌నేన‌ని చెప్పారు. కానీ, పూర్తి స్థాయి రాజ‌కీయాల్లో లేని న‌టులు మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌న్నారు. ఎక్క‌డా దారి త‌ప్ప‌కుండానే ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తాను పుష్క‌ర కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని.. అనేక విమ‌ర్శ‌లు తానుకూడా చేశాన‌ని కానీ, ఏనాడూ కేసులు పెట్టించుకునే స్థాయికి దిగ‌జారి వ్యాఖ్య‌లు చేయ‌లేదన్నారు.

పోసాని మాత్రం ఓ పార్టీ అధినేత‌(పేరు చెప్ప‌కుండానే జ‌గ‌న్ గురించి)ను మ‌చ్చిక చేసుకునేందుకు నోరు పారేసుకున్నార‌ని శివాజీ వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు కేసులు పెట్టించుకున్న‌ది.. కోర్టులు, జైళ్ల చుట్టూ తిరుగుతున్న‌ది మాత్రం పోసానేన‌ని చెప్పారు. “నాకు తెలిసి పోసాని.. త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో ఇంత బాధ ఎప్పుడూ అనుభ‌వించి ఉండ‌రు. ఆయ‌న రియ‌లైజ్ అవుతున్నార‌ని అనుకుంటున్నాను. ఏపీ ప్ర‌భుత్వం కూడా.. ఇక‌, ఆయ‌న‌ను వ‌దిలేయాలి. జ‌రిగిన దానికి ఆయ‌న చాలా చింతిస్తున్న‌ట్టు ప‌త్రిక‌ల్లో వార్తలు కూడా వ‌స్తున్నాయి. కాబ‌ట్టి ఆయ‌న రియ‌లైజ్ అయ్యేందుకు ప్ర‌భుత్వ‌మే ఒక అవ‌కాశం క‌ల్పించాలి” అని శివాజీ వ్యాఖ్యానించారు.