ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సాయంత్రం భేటీ అయిన మంత్రి వర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని రద్దు చేసింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని తాడిగడప మునిసిపాలిటీకి.. జగన్ సర్కారు “వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీ”గా పేరు పెట్టింది. అయితే.. దీనిపై ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేశారని.. స్థానికంగా ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం లేదని సీఎం చంద్రబాబుపేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వైఎస్సార్ పేరును తొలగిస్తున్నట్టు తెలిపారు.
దీంతో ఇక నుంచి వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీ.. కేవలం తాడిగడప మునిసిపాలిటీగానే కొనసాగుతుందని చంద్రబాబు మంత్రి వర్గానికి స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే జీవో జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇదేసమయంలో వైసీపీ హయాంలో చేపట్టిన జిల్లాల పునర్విభజనలో కడప పేరును తీసేశారని.. దీనికి కూడా ‘వైఎస్సార్’ అని పేరు పెట్టారని కొందరు మంత్రులు తెలిపారు. ఈ పేరును కూడా తొలగించాలని విన్నవించారు. అయితే.. అక్కడి ప్రజలు అలానే కోరుకుంటే.. తప్పకుండా మార్చేద్దామని.. కానీ, దీనిపై ఎవరూ అభ్యంతరం చెప్పలేదని.. కాబట్టి ఆ పేరును అలానే కొనసాగిద్దామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇక, చేనేత కార్మికులకు 500 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందించాలని కేబినెట్ నిర్ణయించింది. వారికి ప్రభుత్వం ఇప్పటికే అన్ని విధాలా అండగా ఉంటో్ందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో చేనేత కార్మికులు తమకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను 200 యూనిట్ల నుంచి 500 యూనిట్లకు పెంచాలనికోరినట్టు చెప్పారు. దీంతో వారికి అనుకూలంగా ఉండేందుకు.. ఉచిత విద్యుత్‌ను 500 యూనిట్ల వరకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఉపాధ్యాయుల బదిలీలను చట్టబద్ధం చేస్తూ..(అంటే ఎప్పుడు బడితే అప్పుడు కాకుండా.. నిర్దేశిత సమయంలోనే బదిలీలు ఉండేలా) తీసుకున్న నిర్ణయానికి కూడా మంత్రి వర్గం ఓకే చెప్పింది.
ఇక, అమరావతిలో వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తూ.. మంత్రి పి. నారాయణ నేతృత్వంలోని ఉప సంఘం.. తీసుకున్న నిర్ణయాలను కూడా చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం ఓకే చేసింది. మరోవైపు కీలకమైన ఎస్సీ వర్గీకరణ కమిషన్(రాజీవ్ రంజన్ మిశ్రా) ఇచ్చిన నివేదికకు కూడా.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. అనంతరం జిల్లాలో అనంతపురం, సత్యసాయి జిల్లాలో పునరుత్పాదక ఇంధన వనరుల ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కూడా మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా 40 వేల మందికి ఉపాధి లభిస్తుందని 10 నుంచి 20 వేల ఉద్యోగాలు లభిస్తాయని సీఎం చెప్పారు.