టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా గత అనుభవాలను పదే పదే గుర్తు చేసుకుంటున్న చంద్రబాబు…తన మనసులోని భవాలను ఎలాంటి మొహమాటం లేకుండానే బయటపెట్టేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఆయన నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు వినిపించాయి. 2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి వేరేవ్వరో కారణం కాదన్న చంద్రబాబు … తన కారణంగానే ఆ రెండు ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు అయ్యిందని వ్యాఖ్యానించారు.
2004, 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలో ఉండి ఎన్నికలకు వెళ్లింది. 1999లో కూడా టీడీపీ అధికారంలో ఉండి ఎన్నికలకు వెళ్లగా… ఆ ఎన్నికల్లో తిరిగి టీడీపీని విజయపథాన నడిపిన చంద్రబాబు… తన సీఎం ప్రస్థానాన్ని కొనసాగించారు. 2004 ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచి ఉంటే.. హ్యట్రిక్ సీఎంగా ఆయన రికార్డు కొట్టేవారు. అయితే నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ టీడీపీ నుంచి అదికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇక 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ అదికారంలో ఉండే ఎన్నికలకు వెళ్లి… వైసీపీ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
అదికారంలో ఉండి కూడా.. ప్రజా సేవలో ముందుండి కూడా 2004, 209 ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయామని చంద్రబాబు చాలా సార్లు తనను తాను ప్రశ్నించుకుని ఉంటారు. ఇప్పుడు ఆ విషయాన్నే ఆయన బయటపెట్టేశారు. ఆ రెండు ఎన్నికల్లో తాను పనిలో పడిపోయి… పార్టీని, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయానని చంద్రబాబు అన్నారు. ఆ సమయంలో తాను కొన్ని పనులు చేయలేకపోయానని ఆయన ఒప్పేసుకున్నారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినప్పుడు ఇక అపజయమన్నదే ఉండదని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తంగా ఆ రెండు కీలకమైన ఎన్నికల్లో టీడీపీ తన కారణంగానే ఓడిపోయిందని చెప్పి చంద్రబాబు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates