వైసీపీ నేత‌లు.. కూలీల సొమ్ము 250 కోట్లు కొట్టేశారు:  ప‌వ‌న్‌

ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రో సారి త‌న విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించారు. గ‌త వైసీపీ పాల‌న‌పై ఆయ‌న దుమ్మెత్తి పోశారు. అనేక వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్ర‌భుత్వం.. చివ‌ర‌కు రెక్కాడితేకానీ.. డొక్కాడ‌ని కూలీల సొమ్మును కూడా కొట్టేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఉపాధి హామీ ప‌థ‌కం కింద‌.. కూలీల‌కు ద‌క్కాల్సిన రూ.250 కోట్ల‌ను వైసీపీ నాయ‌కులు సొంతం చేసుకున్నార‌ని ఆధారాల‌తో స‌హా స‌భ‌కు వివ‌రించారు.

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని రాజ‌కీయ ఉపాధి హామీ ప‌థ‌కంగా వైసీపీ నాయ‌కులు మార్చుకున్నార‌ని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. తాను పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే.. కూలీల‌కు న్యాయం చేసేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాన‌న్నారు. ఈ క్ర‌మంలోనే  ఉపాధి హామీ పథకాన్ని అంద‌రికీ చేరువ చేసి.. కూలీల క‌డుపు నింపాల‌ని భావించిన‌ట్టు చెప్పారు. అయితే.. వైసీపీ హ‌యాంలో ఈ ప‌థ‌కం అమ‌లు చేసిన‌ప్పుడు కోట్ల రూపాయ‌లను కొట్టేసిన విష‌యం వెలుగు చూసింద‌న్నారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ప‌థ‌కం నీరు గారిపోయింద‌న్నారు. ఉపాధి హామీ పథకం లో అవకతవకలు జరుగకుండా చూడాల్సిన వ్యక్తే అవినీతికి పాల్పడినట్లు గుర్తించామ‌న్నారు. రూ.250 కోట్ల అవినీతి ఉపాధి హామీ ప‌థ‌కంలో జ‌రిగింద‌ని తెలిసిన త‌ర్వాత‌.. నా నోట మాట రాలేద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అయితే.. ఈఅవినీతిని ప‌క్కాగా చేయ‌డంతో సాక్ష్యాధారాల‌ను కూడా లేకుండా చేశార‌ని తెలిపారు. దీంతో రూ.250 కోట్ల‌లో కేవ‌లం రూ.74 కోట్లు మాత్రమే రికవరీ  అవుతుంద‌ని అంచ‌నా వేసిన‌ట్టు చెప్పారు.

ఎలాంటి ఉపాధి ప‌నులు చేయకుండానే చేసినట్లు రాసి సొమ్ములు తీసుకున్నార‌ని ప‌వ‌న్ ఆరోపించారు. ఉపాధి హామీలో సభ్యులు అడిగినట్టు వేజెస్ పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంద ని.. ఇలా.. కేంద్రం నుంచి వ‌చ్చిన సొమ్మును కూడా.. కాజేశార‌ని.. ఒక్క‌రికి నెల‌కు 15 రోజుల పాటు ప‌ని క‌ల్పించాల్సి ఉంటుంద‌ని.. కానీ.. వైసీపీ హ‌యాంలో ఒకే వ్య‌క్తికి నెల‌లో రెండు సార్లు ప‌ని క‌ల్పించిన‌ట్టు రాసి సొమ్ములు కాజేశార‌ని ఆరోపించారు. దీనిపై నిశితంగా దృష్టి పెట్టిన‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌రించారు.