తెలంగాణలో సోమవారం మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ శాసన మండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న… సోమవారం శాసన సభా ప్రాంగణంలో అందరి దృష్టిని ఆకర్షించారు. మండలి సమావేశాలకు మల్లన్న హాజరయ్యారో, లేదో తెలియదు గానీ… ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు చెందిన పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు మరో మాజీ మంత్రి హరీశ్ రావులతో ఆయన భేటీ అయ్యారు.
బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న కనిపించినంతనే… కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేస్తే… బీఆర్ఎస్ లో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారా? అన్న దిశగా అందరూ షాక్ కు గురై అలా చూస్తూ ఉండిపోయారు. అయితే బీఆర్ఎస్ లో చేరడానికి మల్లన్న ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లలేదట. ఇంకెందుకోసం వచ్చారన్న విషయానికి వస్తే.. బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా మల్లన్న ధర్నాు దిగబోతున్నారట. ఆ ధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరేందుకు ఆయన కేటీఆర్, హరీశ్ రావులను కలిశారట. ఈ మేరకు తమ ధర్నాకు మద్దతు తెలపాలంటూ మల్లన్న.. కేటీఆర్, హరీశ్ రావులకు ఓ వినతి పత్రం కూడా సమర్పించారు.
వాస్తవానికి బీఆర్ఎస్ తో మల్లన్నకు ఆది నుంచి వైరం ఉంది. గతంలో ఖమ్మం పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా… అప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేసిన మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. నాడు బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి బరిలోకి దిగారు. అయితే మల్లన్న తనదైన మార్కు ప్రచారం సాగించి గ్రాడ్యుయేట్స్ ను భారీ సంఖ్యలోనే తన వైపునకు తిప్పుకున్నారు. ఓ వైపు మల్లన్న, మరోవైపు రాజేశ్వరరెడ్డి హోరాహోరీ పోరు సాగించారు. బరిలో గట్టి పోటీ ఇచ్చిన మల్లన్న బీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించారు. ఒకానొక దశలో మల్లన్న విజయం సాధిస్తారేమోనన్న దిశగానే కౌంటింగ్ సాగింది. అయితే చివరకు అతి తక్కువ మెజారిటీతో రాజేశ్వర రెడ్డి విజయం సాధించారు. అలాంటి బీఆర్ఎస్ కార్యాలయంలో ఇప్పుడు మల్లన్న కనిపించడం ఆసక్తి రేకెత్తించింది.