మహిళలకు కూటమి అదిరే గిఫ్ట్!… అగ్రి ప్రోడక్ట్స్ కూ బూస్టే!

ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తుల అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం… రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించే వ్యవసాయోత్పత్తులతో పాటుగా వారు తయారు చేసే వ్యవసాయేతర ఉత్పత్తులకు విలువను జోడిండచంతో పాటుగా వాటిని ఆన్ లైన్ ద్వారా విశ్వవ్యాప్తంగా అమ్మేందుకు ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తోడ్పాటు అందించనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఫ్లిప్ కార్ట్ సంస్థ ఓ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఇక ఇదే విషయంలో మరో సంస్థ కూడా ఏపీ సర్కారుతో మరో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమ వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులపై డ్వాక్రా మహిళలకు ప్యాపార శిక్షణను అందించేందుకు కేటలిస్టు మేనేజ్ మెంట్ సర్వీసెస్ అంగీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ రెండు ఒప్పందాలతో డ్వాక్రా మహిళల జీవన పరిస్థితులు మెరుగు కానున్నాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా తొలుత డ్వాక్రా మహిళలు పండించిన వేరుశనగను ఫ్లిప్ కార్ట్ విశ్వ విఫణిలో విక్రయించనుంది. అంతకుముందు డ్వాక్రా మహిళలు పండించే వేరుశనగను ఆ సంస్థ ప్రాసెసింగ్ చేసి పంట ఉత్పత్తులకు విలువను జోడించనుంది. ఫలితంగా డ్వాక్రా మహిళలకు మరింత ఆదాయం సమకూరనుంది.

ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ రెండు ఒప్పందాలు కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే ఉపయోగపడటం లేదు. రాష్ట్రంలో పండే పంట ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయి మార్కెట్లోకి తీసుకువెళుతున్నాయి. తొలి దశలో కేవలం వేరుశనగను మాత్రమే విక్రయించనున్న ఫ్లిప్ కార్ట్… భవిష్యత్తులో డ్వాక్రా మహిళలు పండించే ఇతరత్రా పంట ఉత్పత్తులు, వ్యవసాయేతర ఉత్పత్తులను కూడా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించనుంది. ఫలితంగా అటు డ్వాక్రా మహిళలతో పాటుగా రాష్ట్రంలో పండే పంటలకు కూడా అంతర్జాతీయంగా డిమాండ్ రానుంది. ఫలితంగా రాష్ట్ర వ్యవస్తాయ ఉత్పత్తులకు మరింత మేర మంచి ధరలు రానున్నాయి. అంటే…ఈ ఒప్పందాలు ఉభయతారకమన్నమాట.