బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్ లో పెను కలకలమే రేపింది. అయితే ఆగంతకుడు ఇంటిలోకి ప్రవేశించిన సమయంలో ఎంపీ ఇంటిలో లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కట్టుదిట్టమైన భద్రత కలిగిన డీకే ఇంటిలోకి ఓ ఆగంతకుడు ఎంట్రీ ఇవ్వడం, ఆపై ఏకంగా గంటన్నరకు పైగా అతడు ఆ ఇంటిలో ఫ్రీగా సంచరించిన వైనం డీకే ఫ్యామిలీని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. అయితే ఆ ఆగంతకుడు ఇంటిలో దేనిని కూడా తీసుకెళ్లలేదని డీకే చెబుతున్న నేపథ్యంలో.. అసలు ఆ ఆగంతకుడు ఏ లక్ష్యంతో ఎంపీ ఇంటిలోకి ప్రవేశించాడన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పరిధిలో ఎంపీ డీకే అరుణ నివాసం ఉంది. డీకే ఇల్లు ఉన్న లైన్ లోనే కాస్తంత దూరంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఉంది. అంటే…ఆ ప్రాంతం హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నట్టే లెక్క. అలాంటి ప్రాంతంలో ఉన్న డీకే ఇంటిలోకి శనివారం రాత్రి ఓ ఆగంతకుడు…కిచెన్ పక్కనున్న అద్దాలను తొగలించి ఇంటిలోకి ప్రవేశించాడు. తర్వాత కిచెన్, హాల్, బెడ్ రూంలలోని సీసీ కెమెరాల యాంగిల్ ను మార్చేసిన అతడు… దాదాపుగా అతడు గంటన్నరకు పైగా ఇంటిలోనే సంచరించాడు. హాల్, కిచెన్, బెడ్ రూంలలో తిరిగాడు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లవ్స్ వేసుకుని వచ్చిన అతడు తన ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే అతడు ఇంటిలోకి ప్రవేశించిన సమయంలో డీకే ఫ్యామిలీ ఇంటిలో లేదట. తీరా తిరిగివచ్చాక… కిచెన్ పక్నున్న అద్దాలు తొలగించి ఉండటం, ఇంటిలో ఎవరో తిరిగినట్టుగా ఆనవాళ్లు ఉండటంతో డీకే ఫ్యామిలీ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది.
ఈ విషయంపై ఎంపీ డీకే నుంచి సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ పోలీసులు… ఆమె ఇంటికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ విచారణలో భాగంగా ఆగంతకుడు డీకే ఇంటి నుంచి ఒక్కటంటే ఒక్క వస్తువును కూడా తీసుకెళ్లలేదని తేలింది. ఈ విషయం తేలిన వెంటనే డీకే ఫ్యామిలీ మరింతగా భయాందోళనకు గురైంది. డీకే అరుణ భర్త డీకే భరత సింహారెడ్డి మొన్నటిదాకా రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నారు. భరత సింహారెడ్డికి రాజకీయ ప్రత్యర్థులు కూడా ఎక్కువేనని చెప్పాలి. అదే సమయంలో ప్రస్తుతం ఆయనకు ప్రభుత్వం భద్రత కల్పించడం లేదట. తన భర్తకు భద్రత కల్పించమని డీకే అరుణ స్వయంగా కోరినా కూడా రేవంత్ సర్కారు నుంచి స్పందన కనిపించడం లేదట. ఈ వివరాలను స్వయంగా డీకే అరుణనే బయటపెట్టారు.
ఇదిలా ఉంటే… డీకే అరుణ ఇంటిలోకి ప్రవేశించిన ఆగంతకుడు ఆ ఇంటి గురించి బాగా తెలిసిన వ్యక్తేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే… ఆ ఇంటిలో ఏది ఎక్కడుందన్న విషయంపై సంపూర్ణ అవగాహన అతడికి ఉందని… ఈ కారణంగానే అతడు ఇంటిలోకి ప్రవేశించిన మరుక్షణమే తన ఎంట్రీని రికార్డు చేయకుండా ఉండేలా సీసీ కెమెరాల డైరెక్షన్ ను మార్చాడని పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా అతడు ఇదివరు డీకే ఇంటిలో పని చేసిన వంట మనిషిగా పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని వారు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్…డీకేకు ఫోన్ చేసి పరామర్శించారు. డీకేకు భద్రత కల్పించాలని పోలీసులను ఆయన ఆదేశించారు.