అంతా సిద్ధం!.. టెస్లా రావడమే ఆలస్యం!

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైపోయింది. ఢిల్లీ, ముంబైలలో కంపెనీ కార్ల షోరూమ్ లు ఏర్పాటు అవుతున్నాయి. ఆపై తన కార్లను ఇక్కడే భారత్ లోనే ఉత్పత్తి చేసే దిశగా టెస్లా అడుగులు వేస్తోంది. ఇందుకోసం సరైన ప్రాంతాల ఎంపిక కోసం కూడా ఆ కంపెనీ అప్పుడే పరిశీలన ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయాన్ని గ్రహించిన పలు రాష్ట్రాలు టెస్లాను తమ రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు పోటీ పడుతున్నాయి. ఆ రాష్ట్రాల జాబితాలో ఏపీ ఉంది. అన్ని రాష్ట్రాల కంటే కూడా టెస్లా రేసులో ఏపీనే ముందు ఉన్నట్లుగా తాజా పరిణామాలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఏపీలో కొరియా కార్ల కంపెనీ కియా తన ప్లాంట్ ను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ కోసం నాడు పెద్ద ఎత్తున రాష్ట్రాలు పోటీ పడగా…కేవలం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఉన్న బ్రాండ్ ఇమేజీతో…కియా ఏపీలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు టెస్లా విషయంలో అదే జరిగి తీరుతుందన్న మాట ఒకింత గట్టిగానే వినిపిస్తోంది. టెస్లాను ఏపీకి రప్పించే దిశగా ఎప్పటినుంచో చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో రూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్.. అమెరికాలో టెస్లా కార్యాలయానికి వెళ్లారు. ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు. రాష్ట్రంలోని పరిస్థితులను కూడా వారి ముందు పెట్టారు.

లోకేశ్ ప్రతిపాదనలకు టెస్లా కంపెనీ ప్రతినిదులు నాడు సానుకూలంగానే స్పందించారు. మరి ఇప్పుడు వారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చిందో తెలియదు గానీ… నాలుగైదు రోజుల క్రితం ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు తిరుపతి జిల్లా పరిధిలోని మేనకూరు పారిశ్రామిక వాడను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఖాళీగా ఎంత భూమి ఉంది?… అది టెస్లా కంపెనీ ఏర్పాటుకు సరిపోతుందా? అన్న వివరాలను ఆయన అధికారులతో ఆరా తీశారు. ఈ తరహా పరిశీలనే మేనకూరుకు సమీపంలోని శ్రీసిటీ, క్రిస్ సిటీల్లోనూ జరిగినట్లు సమాచారం. పోర్టులతో పాటుగా హైవేల అందుబాటు, పారిశ్రామిక అభివృద్ధి దిశగా అక్కడ సాగుతున్న వృద్ధి రేటు, మానవ వనరుల అందుబాటు.. ఇలా అన్ని వివరాలను సేకరించి సిద్దంగా ఉంచారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో టెస్లా ఏపీలోకి అడుగుపెట్టడమే ఆలస్యం అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.