కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని పదవులు ఇచ్చినా.. ఇంకా వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పదవులు దక్కక ఎదురు చూస్తున్నారు. తాజాగా రెండు రోజుల కిందట.. మళ్లీ నామినేటెడ్ పదవుల వ్యవహారం తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలోని 21 ప్రముఖ దేవాలయాలకు బోర్డులు ఏర్పాటు చేసి.. వాటికి చైర్మన్‌లుగా కూటమి పార్టీల నాయకులను నియమించాలని భావించారు.
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఆయా పదవులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. 21 ఆలయాల ట్రస్టు బోర్డు చైర్మన్ పదవులను ఆశించేవారు.. దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఇంకేముంది.. కేవలం రెండు రోజుల్లోనే 60 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా 40 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. మరో 20 వేల మందికి పైగా ఆఫ్ లైన్‌లో తన కార్యాలయానికి దరఖాస్తులు పంపారని చంద్రబాబు అన్నారు.
అంటే.. ఉన్న 21 పోస్టులకు 60 వేల దరఖాస్తులు వచ్చాయంటే.. ఒక్కొక్క పదవికి 3000 మంది చొప్పున పార్టీ నాయకులు పోటీ పడుతున్నారన్న విషయం స్పష్టమైంది. ఇప్పుడు వీరిని స్క్రూటినీ చేసే బాధ్యతను జిల్లాల నాయకులకు అప్పగించారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తులను నియోజకవర్గాల వారీగా అక్కడకే పంపించి.. ఎమ్మెల్యేలు వీరిలో ఉత్తమమైన నాయకులను, గత ఏడాది ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి ఎంపిక చేయాలని సూచించారు.
మరి ఏ మేరకు ఈ పదవులు ఎవరికి దక్కుతాయో చూడాలి. ఇవి కాకుండా.. సిఫారసులు, పార్టీలో సీనియర్ల ఒత్తిళ్లు.. ఇలా అనేకం కూడా ఉన్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. 21 పోస్టులకు ఎంత మంది ఎంపిక అవుతారో చూడాలి. ఇక, ఎమ్మెల్యేలు.. స్థానిక నాయకులు .. వీరిలో ఎంత మందికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది కూడా ఆసక్తిగానే మారింది. చూడాలి ఏం జరుగుతుందో. ఒకరకంగా వీరిని ఎంపిక చేసి ఆయా పదవులు ఇవ్వడం అనేది చంద్రబాబు కు ఒక పెద్ద టెస్టేనని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates