బైరెడ్డి ఇంట అక్కాతమ్ముళ్ల సవాల్

రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు జడలు విప్పుతున్నాయి. మొన్నటికి మొన్న నంద్యాల జిల్లాలో వైసీపీ కార్యకర్తపై హత్యాయత్నం జరగగా.. తాజాగా శనివారం కర్నూలు నడిబొడ్డున టీడీపీ కార్యకర్త సంజన్న దారుణ హత్యకు గురయ్యారు. ఈ వరుస ఘటనలు సీమలో కలకలం రేపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో ఫ్యాక్షన్ ఫ్యామిలీగా ముద్ర పడిన బైరెడ్డి కుటుంబంలో అక్కాతమ్ముళ్ల సవాల్ అన్నట్లుగా కొత్త పోరు మొదలైంది. నంద్యాల ఎంపీగా టీడీపీ మహిళా నేత బైరెడ్డి శబరి కొనసాగుతుండగా… జిల్లా పరిధిలోని నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీగా ఆమె సోదరుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

తాజా ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలో తన తమ్ముడు సిద్ధార్థ రెడ్డి తీరుపై శబరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బైరెడ్డి అంటే తానేనని చెప్పిన శబరి… సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి కాదని కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమన్న శబరి… ఆ చర్చకు వచ్చే దమ్ము సిద్ధార్థ రెడ్డికి ఉందా? అని సవాల్ విసిరారు. కేసులు, అరెస్టులు అంటూ సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన శబరి… అక్క అని కూడా చూడకుండా తనపైనే సిద్ధార్థ రెడ్డి తనపైనే కేసులు పెట్టించారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించారని ఆమె ఆరోపించారు. ఏనాడూ బయటకు రాని తన తల్లిపైనా సిద్ధార్థ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. తల్లి, చెల్లికి జగన్ ఏం చేశారో… సిద్ధార్థ రెడ్డి కూడా ఇప్పుడు అదే చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

కర్నూలు నగరంలోని శరీన్ నగర్ లో శనివారం సంజన్నను ఆయన ప్రత్యర్థులు హత్య చేయగా… బాధిత కుటుంబాన్ని పరామర్శించిన శబరి… అక్కడి పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగానే ఆమె సిద్ధార్థ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తరఫున నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బైరెడ్డి రాజశేరరెడ్డి కుమార్తె శబరి కాగా… రాజశేఖరరెడ్డి సోదరుడు, కడప జిల్లాలో స్థిరపడ్డ బైరెడ్డి మల్లికార్జున రెడ్డి కుమారుడు సిద్ధార్థ రెడ్డి. మల్లికార్జున రెడ్డికి రాజకీయాలతో సంబంధం లేకున్నా.. సిద్ధార్థ రెడ్డి మాత్రం 2019 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చి వైసీపీలో చేరారు. వైసీపీ హయాంలో ఆయన ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ గా పనిచేశారు. ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవినీతిలో సిద్ధార్థ రెడ్డికి కూడా పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.