పవన్ విజయంపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

జనసేన 12వ ఆవిర్భావ వేడుకలు జయకేతనం పేరిట పిఠాపురం శివారు చిత్రాడలో అంగరంగ వైభవంగా సాగుతున్న సంగతి తెలిసిందే. వేడుకకు ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు హాజరయ్యారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎంగా ఉన్న తన సోదరుడు పవన్ కల్యాణ్ సభా వేదిక ఎక్కకముందే..నాగబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన నోట సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. అది కూడా తన సోదరుడు పవన్ కల్యాణ్ పిఠాపురంలో దక్కించుకున్న విజయంపై నాగబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఎవరైనా గెలిపించారనుకుంటే…అది వారి ఖర్మ అని నాగబాబు సంచలన వ్యాఖ్య చేశారు. అంతటితో ఆగని నాగబాబు.. పవన్ కల్యాణ్ ను పిఠాపురం ఓటర్లు గెలిపించారని ఆయన అన్నారు. నాగబాబు నోట నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలకు జన సైనికుల నుంచి ఓ రేంజిలో ప్రతిస్పందన లభించింది. నాగబాబు ఈ వ్యాఖ్యలు చేసినంతనే పార్టీ శ్రేణులు కేరింతలు కొట్టారు. వెరసి నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనమని భావించినా… అవి పార్టీ శ్రేణుల్లో ఓ రేంజిలో ఉత్సాహాన్ని నింపడం గమనార్హం.

ఇక ఆ తర్వాత కూడా తన ప్రసంగాన్ని కొనసాగించిన నాగబాబు… జనసేన ప్రస్తుతం అధికారంలో ఉందన్న విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలని సూచించారు. అధికార పార్టీకి చెందిన వారిగా చాలా బాధ్యతగా మెలగాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అధికార మత్తు తలకెక్కి వాగితే..ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో అందరికీ తెలిసిందేనన్నారు. పార్టీ నేతలతో పాటుగా పార్టీ కార్యకర్తలు కూడా తమ నోటిని అదుపులో పెట్టుకుని వ్యవహరించాలని ఆయన సూచించారు. అనవసర వ్యాఖ్యలతో పార్టీకి ఇబ్బందులు తీసుకురావద్దని కూడా ఆయన కోరారు.