బాబుతో సోమనాథ్, సతీశ్ రెడ్డి భేటీ… విషయమేంటి?


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం బిజీబిజీగా గడిపారు. ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మరోవైపు తనను కలిసేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు రావడంతో బాబు షెడ్యూల్ బిజీగా సాగింది. ఇందులో భాగంగా బాబుతో డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డి, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ లతో పాటు పలువురు రక్షణ, అంతరిక్ష రంగాలకు చెందిన ఓత్సాహిక పారిశ్రామికవేత్తలు పలువురు భేటీ అయ్యారు. పారిశ్రామికవేత్తలను సోమనాథ్ తన వెంటబెట్టుకుని మరీ చంద్రబాబుకు వచ్చారు. ఈ విషయం తెలిసి సతీశ్ రెడ్డి కూడా వారికి తోడుగా వచ్చారు. సతీశ్ రెడ్డి ఏపీకి చెందిన వారు కాగా… సోమనాథ్ కేరళకు చెందిన వారు. వీరిద్దరూ ఉత్తరాదికి చెందిన పారిశ్రామికవేత్తలను బాబు వద్దకు తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత అంతరిక్ష ప్రయోగాలకు ఏపీలోని శ్రీహరికోట షార్ కేంద్రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇస్రో ప్రయోగాలన్నీ దాదాపుగా ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. ఇస్రో ఎంతగా అభివృద్ధి చెందితే షార్ కూడా అంతేస్థాయిలో వృద్ధి చెందడం సర్వసాధారణం. అదే సమయంలో షార్ చుట్టుపక్కన అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన కంపెనీలను స్థాపిస్తే ఎలా ఉంటుందన్న దిశగా చాలా కాలం నుంచి సతీశ్ రెడ్డి యోచిస్తున్నారు. ఇప్పుడు సోమనాథ్ ఆ దిశగానే సాగుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి చంద్రబాబుతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారట. పనిలో పనిగా… ఆయా రంగాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలను కూడా తీసుకెళితే బాగుంటుందని వారిద్దరూ భావించారట. అనుకున్నదే తడవుగా వారిద్దరూ పారిశ్రామికవేత్తలను వెంటేసుకుని మరీ గురువారం చంద్రబాబుతో భేటీ అయ్యారు.

ఈ భేటీలో భాగంగా ఏపీలో ఏరో స్పేస్ తో పాటు డిఫెన్స్ రంగాలకు సంబంధించిన పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ఏఏ ప్రాంతాల్లో ఏఏ పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందన్న విషయంపై సుదీర్ఘ చర్చే జరిగిందట. ఈ సందర్భంగా ఏపీలో రక్షణ, ఏరో స్పేస్ పరిశ్రమలకు గల అవకాశాలపై ఇదివరకే సతీశ్ రెడ్డి ఓ నివేదికను రూపొందించారు. సదరు నివేదికను చంద్రబాబు చేతిలో పెట్టిన సతీశ్ రెడ్డి…ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు కూడా సిద్ధంగానే ఉన్నారని తెలిపారట. ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే…ఏపీని డిఫెన్స్, ఏరో స్పేస్ రంగాలకు కేంద్రంగా మారుస్తామని చెప్పారట. సోమనాథ్ కూడా ఇదే తరహా ప్రజెంటేషన్ ను చంద్రబాబు ముందు ఉంచారట. ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని చంద్రబాబు వారికి అక్కడికక్కడే హామీ ఇచ్చారు. అంటే.. రానున్న రెండు, మూడేళ్లలో డిఫెన్స్, ఏరో స్పేస్ రంగాల్లో ఏపీలో భారీ ఎత్తున పరిశ్రమలు రావడం ఖాయమేనన్నమాట.