తెలుగు నేలలో సినిమా రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకేసారి చట్టసభలకు ఎంపికయ్యారు. ఏపీ శాసన మండలి సభ్యుడిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్ర బాబు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన ఏపీ కేబినెట్ లో మంత్రిగానూ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు తెలంగాణ శాసన మండలి సభ్యురాలిగా విజయశాంతి కూడా ఎన్నికయ్యారు. మరి ఆమెకు తెలంగాణ కేబినెట్ లోకి ఎంట్రీ లభిస్తుందా? లేదా? అన్న దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే రాములమ్మకు కూడా మంత్రిగా అవకాశం దక్కితే మాత్రం రేవంత్ రెడ్డి కేబినెట్ కు ఓ రేంజి బలం వచ్చినట్టేనన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.
ఏపీలో టీడీపీతో కలిసి జనసేన, బీజేపీ సాగుతున్నాయి. మూడు పార్టీల కూటమి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోగా… టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా, జనసేనాని పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును రాజ్యసభకు పంపుదామన్న పవన్ ప్రతిపాదనను వద్దన్న చంద్రబాబు… నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకుందామని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు పవన్ కూడా ఓకే చెప్పారు.
ఫలితంగా అత్యంత సులభంగా గెలిచే అవకాశం ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన చంద్రబాబు…త్వరలోనే తన కేబినెట్ లోకి ఆయనను తీసుకోనున్నారు. వెరసి చట్టసభలో అడుగుపెట్టిన తొలిసారే తమ్ముడు పవన్ మాదిరే నాగబాబు కూడా మంత్రిగా పదవిని చేపట్టినట్టు అవుతుంది.
ఇక విజయశాంతి విషయానికి వస్తే… చాలా కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆమె ఇఫ్పటికే ఓ సారి లోక్ సభ సభ్యురాలిగా కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన రాములమ్మ… బీఆర్ఎస్ తరఫున మెదక్ లోక్ సభ నుంచి ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెకు చట్టసభల్లోకి ఎంట్రీనే దొరకలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీ… బీజేపీ నుంచి కాంగ్రెస్… ఇలా పార్టీలు మారుతూ వచ్చారు.
రేవంత్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయన ఆహ్వానం మేరకే రాములమ్మ హస్తం గూటికి చేరారు. మంచి వాగ్ధాటితో పాటుగా బీఆర్ఎస్ కు సింహస్వప్నం మాదిరగా మారే అవకాశం ఉన్న రాములమ్మను కేబినెట్ లోకి తీసుకుంటే.. గులాబీ దండును ఆమె ఓ రేంజిలో ఆడుకుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే… బీఆర్ఎస్ కు కష్టకాలం మొదలైనట్టేనని చెప్పాలి. అదే సమయంలో కాంగ్రెస్ కు ఈ పరిణామం బాగా ప్లస్ అయ్యే అవకాశాలూ ఉన్నాయని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates