లాంఛనం పూర్తి… 10 మంది ఏకగ్రీవం

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఐదేసి స్థానాల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదికార కూటములకు ఏకంగా 9 స్థానాలు దక్కగా…విపక్షానికి సింగిల్ సీటు మాత్రమే దక్కడం గమనార్హం. అటు తెలంగాణతో పాటుగా ఇటు ఏపీలోనూ ఐదేసి స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా… వాటికోసం ఐదేసి నామినేషన్లు మాత్రమే వచ్చాయి. దాఖలైన నామినేషన్లన్నీ సరిగానే ఉండటంతో వాటిని అనుమతించిన అధికారులు… ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఐదేసి అభ్యర్థులు బరిలోనే నిలవడంతో ఎన్నికలు ఏకగ్రీవం అయినట్టు రెండు రాష్ట్రాల రిటర్నింగ్ అధికారులు గురువారం సాయంత్రం ప్రకటించారు.

ఏపీలో వైసీపీకి రాజీనామా చేసిన జంగా కృష్ణమూర్తి సహా నలుగురు టీడీపీ ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఈ 5 స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ కాగా… అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా ఐదు సీట్లూ అధికార కూటమికే దక్కనుండగా…కేవలం 11 ఎమ్మెల్యేలున్న విపక్షం వైసీపీ అసలు బరిలోకే దిగలేదు. దీంతో టీడీపీ అభ్యర్థులు బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు.. జనసేన నుంచి కొణిదెల నాగేంద్ర బాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజులు నామినేషన్ లు దాఖలు చేశారు. నామినేషన్ల గడువు పూర్తి అయిన తర్వాత వీరంతా పోటీలోనే ఉండటం… 5 స్థానాలు 5 నామినేషన్లే దాఖలవడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

మరోవైపు తెలంగాణలోనూ ఈ నెలాఖరుతో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. ఏపీలో మాదిరిగా కాకుండా తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ఓ మోస్తరు బలంతో ఉండగా… ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకునేంత స్థాయిలో సభ్యులను కలిగి ఉంది. ఈ క్రమంలో నాలుగు సీట్లను గెలుచుకునే స్థాయిలో ఉన్న అధికార కూటమి…మిత్రపక్షం సీపీఐకి ఓ సీటును ఇచ్చి… మూడు సీట్లను కాంగ్రెస్ తీసుకుంది. ఇక బీఆర్ఎస్ కు ఓ సీటు దక్కే అవకాశం ఉండగా,… ఆ పార్టీ తరఫున దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ నుంచి సత్యం యాదవ్ లు నామినేషన్లు వేశారు. ఇక్కడ కూడా ఐదుగురు మాత్రమే బరిలో ఉండటంతో వారంతా ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.