రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయం ప్రభుత్వానికి తెలిసే జరిగే అవకాశాలు తక్కువ. కొన్ని విషయాలు ప్రభుత్వానికి, అధికార పార్టీకి ఏ మాత్రం సంబంధం లేకుండా జరిగిపోతుంటాయి. అయినప్పటకీ, ఆ ఘటనలు ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెస్తుంటాయి. ఇటువంటి క్రమంలో ఆ ఘటనను ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నదానిపై డ్యామేజ్ కంట్రోల్ ఉంటుంది. తాజాగా ఏపీలో జరిగిన ఈ తరహా ఘటనను సంబంధించి మంత్రి లోకేశ్ హ్యాండిల్ చేసిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా ప్రభుత్వం తరఫున లోకేశ్ క్షమాపణలు చెప్పిన తీరు ఎంతోమంది యువనేతలకు ఆదర్శంగా నిలిచింది.
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమలలోని శ్రీ కాశినాయన అన్నదాన సత్రం కూల్చివేత వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాశి నాయన అవధూత కాశిరెడ్డి నాయన పరమపదించిన ఆ చోట పురాతన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కూడా ఉంది. అయితే, ఆ ప్రాంతం టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని హఠాత్తుగా అటవీ శాఖ అధికారులు కొన్ని భవనాలను కూల్చివేశారు. దీంతో, నిత్యం అన్నదానం జరిపి ఎంతోమంది ఆకలి తీరుస్తున్న ఈ సత్రం కూల్చడంపై నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్త ఒకరు ‘ఎక్స్’ ద్వారా లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే, విషయం తెలుసుకున్న లోకేశ్ తక్షణం స్పందించారు.
ఆ అన్నదాన సత్రం కూల్చివేతపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన లోకేశ్….ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్పారు. అంతేకాదు, కూల్చిన చోటే తన సొంత డబ్బులతో అన్నదాన సత్రం పునర్నిర్మిస్తానని హామీనిచ్చారు. అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా సత్రాన్ని కూల్చివేయడం బాధాకరమని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ నిబంధనలు ఉన్నా, భక్తుల మనోభావాలు గౌరవించి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని కూడా హామీనిచ్చారు.