తెలంగాణలో మంగళవారం ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ పరిణామం కేవలం నిమిషాల వ్యవదిలో రాష్ట్రంలో ఓ పెను చర్చకే తెర తీసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జన్నార్.. సంస్థలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కొందరు ఆర్టీసీ ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. అంతటితో ఆగని వారు.. సజ్జన్నార్ అవినీతికి ఇవిగో ఆధారాలు అంటూ ఏకంగా ఓ 9 పేజీలతో కూడిన లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా పంపారు.
సజ్జన్నార్ పేరు వింటేనే… ఇప్పటిదాకా అవినీతి మకిలీ అంటని నిఖార్సైన పోలీసు అధికారి మన కళ్ల ముందు కదలాడతారు. అంతేకాకుండా నేరస్తులకు ఆయన ఓ సింహస్వప్నమే. ప్రత్యేకించి మహిళలపై నేరాలకు పాల్పడే మృగాళ్లకు ఆయన యమకింకరుడిగానూ కనిపిస్తారు. వరంగల్ లో విద్యార్థినిపై యాసిడ్ దాడి కేసు, హైదరాబాద్ లో వెలుగు చూసిన దిశ హత్యాచారం కేసుల్లో అతి తక్కువ సమయంలోనే నిందితులను పట్టేసిన సజ్జన్నార్.. వారిని ఎన్ కౌంటర్ చేసిన తీరు తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోరనే చెప్పాలి. అలాంటి అదికారి అవినీతికి పాల్పడటం ఏమిటి? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.
అయితే సజ్జన్నార్ పై ఊహించని రీతిలో వచ్చి పడిన ఈ ఆరోపణలపై ఆర్టీసీ సంస్థ చాలా వేగంగా స్పందించింది. సంస్థలో డ్రైవర్లు, కండక్టర్లు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వారిలో కొందరు సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారట. వీరిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన సజ్జన్నార్… ఆరోపణలు నిజమేనని తేలిన ఓ 400 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నారట. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారంతా మంగళవారం అనూహ్యంగా నిరసనకు దిగడంతో పాటుగా సజ్జన్నార్ పైనే అవినీతి ఆరోపణలు చేశారని తెలిపింది. సదరు ఉద్యోగులకు సంబంధించి సంస్థ వద్ద ఉన్న వీడియోలను కూడా విడుదల చేసింది. మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.