వంగ‌వీటి రాధా రాజ‌కీయ స‌న్యాసం?

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. అనూహ్య‌మైన పొలిటిక‌ల్ బాంబు పేలింది. దీనికి కార‌ణం.. వంగ‌వీటి రాధా.. రాజ‌కీయ స‌న్యాసం చేయ‌నుండ‌డ‌మే. విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఇక‌, రాధా పేరు వినిపిం చే అవ‌కాశం లేక‌పోవ‌డ‌మే. ఈ విష‌యంపై అంత్యంత స‌న్నిహిత వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఔన‌నే అంటున్నారు రాధా అనుచ‌రులు. దీంతో విజ‌య‌వాడలో ఇక‌, రంగా పేరు మాత్ర‌మే వినిపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఆత్మాభిమానమే ప్ల‌స్సు-మైన‌స్సు!

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ ప్ర‌వేశం చేసిన రాధా.. అవే గుణాల‌ను కూడా అందిపుచ్చుకున్నారు. ఇది కొన్ని కొన్ని సార్లు ప్ల‌స్ అయినా.. అదేస‌మ‌యంలో అనేక సార్లు మైన‌స్ అయింది. త‌న‌కు టికెట్ ఇవ్వ ని పార్టీలో ఉండ‌లేన‌ని భీష్మించి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌త్వం రాధాది. గ‌తంలో ఇదే ప‌రిస్థితి రంగాకు కూడా ఎదురైంది. అయితే.. ఆయ‌న అప్ప‌ట్లో అధిష్టానాన్ని మెప్పించి టికెట్ తెచ్చుకున్నారు. ఈ లౌక్యం వంగ‌వీ టి రాధాలో లోపించింది. పైగా ఆత్మాభిమానం ఆయ‌న‌కు పెట్ట‌ని ఆభ‌ర‌ణంగా ఉన్నా.. అదే ప్ల‌స్సు.. అదే మైన‌స్సు కూడా అయింది.

నాలుగు స్తంభాలాట‌…
రంగాతో పోల్చుకుంటే.. రాధా రాజ‌కీయంగా ప్ర‌యోగాలు చేశార‌నే చెప్పాలి. రంగా కేవ‌లం రెండు పార్టీలకు మాత్ర‌మే నాయ‌కుడిగా ప‌నిచేశారు. త‌ర్వాత చివ‌ర‌కు ఒకే పార్టీలో ప‌రిమిత‌మ‌య్యారు. కానీ రాధా విష‌యా నికి వ‌స్తే.. కాంగ్రెస్‌-ప్ర‌జారాజ్యం-వైసీపీ-టీడీపీ అంటూ నాలుగు స్తంభాలాట ఆడారు. ఇది.. ఆయ‌న ఓటు బ్యాంకును తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌నే చెప్పాలి. అంతేకాదు.. నిల‌క‌డ‌లేని మ‌న‌స్త‌త్వం వంటివి కూడా రాధా గ్రాఫ్‌కు అడ్డంకిగానే మారాయి. ఫ‌లితంగా 2004 విజ‌యం త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు రాధా ప్ర‌జ‌ల మ‌ధ్య విజ‌యం సాధించ‌లేక‌పోయారు.

కీల‌క నిర్ణ‌యం వెనుక‌?
తాజాగా రాధా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు సంచ‌ల‌న బాంబు పేలింది. అయితే.. ఈ నిర్ణ‌యం వెనుక రాజ‌కీయ కార‌ణంతోపాటు.. కుటుంబ కార‌ణాలు కూడా ఉన్నాయ‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప‌ద‌వుల కోసం.. పాకులాడ‌కుండా.. పార్టీలో ప‌నిచేసినా త‌న‌కు గుర్తింపు లేద‌న్న ఆవేద‌న‌.. అడిగితే త‌ప్ప ప‌దవులు ద‌క్కే ప‌రిస్థితి లేద‌న్న ఆందోళ‌న వ్య‌క్తిగ‌తంగా రాధాను కుంగదీస్తున్నాయి. మ‌రోవైపు.. కుటుంబ స‌మ‌స్య‌ల కార‌ణంగా కూడా ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరం జ‌ర‌గాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు రాధా రంగా మిత్ర‌మండ‌లిలోని కీల‌క వ్య‌క్తి ఒక‌రు చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.